జలదోపిడీని ఆపాల్సి ఉంది
కల్వకుర్తి రూరల్: ప్రజాస్వామిక వాదులు, పెద్దలు, ప్రజాసంఘాలు, అన్ని రాజకీయ పార్టీలు కలసి వచ్చి జలదోపిడీని ఆపాల్సి ఉందని పాలమూరు అధ్యయన వేదిక వ్యవస్థాపక అధ్యక్షుడు రాఘవాచారి పిలుపునిచ్చారు. శనివారం కల్వకుర్తిలోని యూటీఎఫ్ భవనంలో జలదోపిడీపై రౌండ్‌టేబుల్ సమావేశం నిర్వహించారు. రాఘవాచారితో పాటు ఇరిగేషన్ నిపుణులు రవి హాజరయ్యారు. అధ్యయన వేదిక జిల్లా కన్వీనర్ వెంకట్‌గౌడ్ అధ్యక్షతన సమావేశం జరిగింది. ఈ సందర్భంగా రాఘవాచారి మాట్లాడుతూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఎక్కువగా నష్టపోయిన ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా నష్టపోతూనే ఉండడం బాధాకరమన్నారు. 1956లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఏర్పాటయ్యాక నీటి విషయంలో పాలమూరు జిల్లా రైతులకు అన్యాయానికి గురి చేశారని అన్నారు. ప్రస్తుతం పాలమూరు జిల్లాకు దక్కాల్సిన నీటివాటాను ప్రజల కళ్ల ఎదుటే నల్గొండ జిల్లాకు తరలించుకుపోతుంటే అడ్డగించాల్సిన 14మంది ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధులు నోరు మెదపకపోవడం ఏమిటని రాఘవాచారి ప్రశ్నించారు. జిల్లాలో సాగునీరు లేక ప్రజలు దుర్భరమైన జీవితాలు గడుపుతున్నారు అని ఆవేదన వ్యక్తం చేశారు. పాలమూరు జిల్లాకు జరిగిన అన్యాయాన్ని అడ్డుకుందామని అన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి ఈ అన్యాయాన్ని ఆపాలన్నారు. సమావేశంలో సదానందంగౌడ్, ఆంజనేయులు, పరశురాముడు, బాబీ దే వ్, సీఐఐ పరశురాములు, అంజి, రాజేందర్, గోపా ల్, సైదులు, బాలయ్య, జంగయ్య పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment