యువకుడి బలవన్మరణం
మద్దూరు/కొత్తపల్లి: ప్రేమించిన అమ్మాయి తల్లిదండ్రులు పెళ్లికి నిరాకరించారని మనస్తాపానికి గురై ఓ యువకుడు పురుగుమందు తాగి మృతిచెందిన ఘటన కొత్తపల్లి మండలం గోకుల్‌నగర్‌లో చోటు చేసుకుంది. గ్రామస్తుల కథనం మేరకు.. గ్రామానికి చెందిన కావలి సాయికుమార్ (22) వ్యవసాయం చేస్తూ జీవనం సాగించేవాడు. ఈ క్రమంలో గ్రామానికి చెందిన ఓ అమ్మాయిని ఏడాదిగా ప్రేమిస్తున్నాడు. పెళ్లి చేసుకుంటానని అమ్మాయి తండ్రి రాములుకు చెప్పగా ఆయన మందలించడంతో మనస్తాపానికి గురై ఈ నెల 17న పొలంలో పురుగుమందు తాగాడు. చుట్టుపక్కల పొలాల రైతులు గుర్తించి వెంటనే జిల్లా ఆస్పత్రికి, అటు నుంచి మహబూబ్‌నగర్ ఎస్వీఎస్‌కు తరలించారు. పరిస్థితి విషమించడంతో శనివారం హైదరాబాద్ నిమ్స్‌కు తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతిచెందాడు. తల్లి కావలి భీమమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపడుతున్నట్లు ఎస్‌ఐ విజయ్‌కుమార్ ఆదివారం వివరించారు.
గుర్తుతెలియని వృద్ధుడి మృతదేహం లభ్యం
నాగర్‌కర్నూల్ క్రైం: గుర్తు తెలియని వృద్ధుడి మృతదేహం లభ్యమైన సంఘటన జిల్లాకేంద్రంలోని జనరల్ ఆస్పతిలో ఆదివారం చోటుచేసుకుంది. ఎస్‌ఐ గోవర్ధన్ తెలిపిన సమాచారం మేరకు.. జిల్లాకేంద్రంలోని జనరల్ ఆస్పత్రిలో 65 ఏళ్ల వృద్ధుడు మృతి చెంది ఉండగా గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని జనరల్‌ఆస్పత్రి మార్చురీకి తరలించారు. ఎవరైనా ఆనవాళ్లు గుర్తిస్తే స్థానిక పోలిస్‌స్టేషన్‌లో సంప్రదించాలని ఎస్‌ఐ సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment