
మరమ్మతు..
‘జూరాల’కు
రూ.1.20 కోట్లతో ప్రతిపాదనలు పంపిన అధికారులు
రామన్‌పాడు గేట్లకు లీకేజీలు..
రామన్‌పాడు కుడి, ఎడమ కాల్వల ద్వారా సాగునీటిని విడుదల చేస్తున్న అధికారులు ఆయా గేట్లను పూర్తిస్థాయిలో మూసివేసినా లీకేజీలు ఏర్పడి ముందుకు పారుతోంది. అంతేగాకుండా ఎప్పుడో చేసిన కాల్వల లైనింగ్ దెబ్బతినడంతో ఎప్పుడు తెగిపోయాయోనన్న సందేహాలను రైతులు వ్యక్తం చేస్తున్నారు. తాగునీటి అవసరాల కోసం రామన్‌పాడు రిజర్వాయర్‌లో నీటిని నిల్వ చేస్తుంటారు. కాల్వల గేట్లు దెబ్బతినడంతో నీటి తాకిడికి ఎప్పుడు కొట్టుకుపోతాయో తెలియని పరిస్థితి నెలకొంది.
అమరచింత: ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు ప్రధాన ఎడమ కాల్వ, రామన్‌పాడు కుడి కాల్వ గేట్లు, అక్కడక్కడ దెబ్బతిన్న కాల్వ లైనింగ్, చిన్న చిన్న మరమ్మతులు వేసవిలో చేపట్టేందుకు అధికారులు రూ.1.20 కోట్లతో ప్రతిపాదనలు సిద్ధం చేసి ఉన్నతాధికారులకు పంపించారు. ప్రస్తుతం కాల్వల్లో సాగు, తాగునీరు వదులుతున్నామని పంట కోతలు పూర్తయిన వెంటనే అధికారుల ఆదేశాల మేరకు పనులు చేపట్టేందుకు టెండర్ల ప్రక్రియ పూర్తి చేయనున్నామని అధికారులు వెల్లడిస్తున్నారు. వేసవి పూర్తయ్యే నాటికి పనులు పూర్తి చేసేలా ప్రణాళికతో ముందుకుసాగుతున్నామన్నారు. జూరాల ప్రధాన ఎడమ కాల్వ వెంట రంధ్రాలు పడటం, లైనింగ్ పెచ్చులూడుతోందని.. వేసవిలో మరమ్మతులు పూర్తిచేసి సకాలంలో సాగునీరు అందించాలని ఆయకట్టు రైతులు కోరుతున్నారు. జలాశయం నుంచి ఆత్మకూర్ శివారు వరకు ఉన్న జూరాల ఎడమకాల్వ వెంట ఎనిమిది చోట్ల కాల్వ దెబ్బతింది. వీపనగండ్ల వరకు ఉన్న ప్రధాన కాల్వ వెంట ఎన్ని గండ్లు ఉన్నాయో గుర్తించే పనుల్లో వర్స్ ఇన్‌స్పెక్టర్లు ఉన్నారు. రెండేళ్ల కిందట రూ.50 లక్షలతో డి–6 కాల్వ వెంట మరమ్మతులు చేసిన అధికారులు ప్రస్తుతం రూ.1.20 కోట్లతో గేట్లు, లైనింగ్ పనులు చేపట్టేందుకు సిద్ధమవుతున్నారు.
ఆయకట్టు ఇలా..
జూరాల ప్రధాన ఎడమ కాల్వ ఆయకట్టు 1.20 లక్షల ఎకరాలుగా ఉండగా.. ప్రస్తుతం 85 వేల ఎకరాలకు మాత్రమే సాగునీరు అందుతుంది. అమరచింత మండలం నుంచి ఆత్మకూర్, మదనాపురం, పెబ్బేరు, శ్రీరంగాపురం, చిన్నంబావి, వీపనగండ్ల మండలం వరకు సుమారు 75 కిలోమీటర్ల పొడవున కాల్వ ఉంది. ఆయా మండలాలను కొన్ని విభాగాలుగా గుర్తించి వాటి ప్రకారం రైతులకు సాగునీరు అందిస్తున్నారు. చివరి ఆయకట్టు వీపనగండ్లలోని గోపాల్‌దిన్నె రిజర్వాయర్ వరకు సాగునీరు ఎడమకాల్వ ద్వారానే విడుదల చేస్తున్నారు.
ఆరు కిలోమీటర్లు.. ఎనిమిది రంధ్రాలు...
మూలమళ్ల నుంచి ఆత్మకూర్ శివారు వరకు ఎనిమిది ప్రదేశాల్లో కాల్వ దెబ్బతింది. వీటి మరమ్మతులు చేపట్టకపోతే వచ్చే వర్షాకాలం వరదల నీటి ఉధృతికి లైనింగ్ దెబ్బతిని గండ్లుపడే ప్రమాదం ఉందని రైతులు చెబుతున్నారు.
రెండేళ్లుగా..
జూరాల ప్రధాన ఎడమకాల్వకు ఏర్పడిన రంధ్రాలను పూడ్చడంతో పాటు దెబ్బతిన్న ప్రదేశాలను గుర్తించి వెంటనే మరమ్మతులు చేపట్టాలి. రెండేళ్లుగా కాల్వ పనులు, చేపట్టకపోగా.. కనీసం పూడికతీత, ముళ్లపొదలు కూడా తొలగించడం లేదు.
– వెంకటేష్, నందిమళ్ల
ప్రతిపాదనలు పంపించాం..
జూరాల ప్రధాన ఎడమకాల్వ వెంట ఉన్న రంధ్రాలను పూడ్చడంతో పాటు చిన్న చిన్న మరమ్మతులకు నిధులు మంజూరు చేయాలని గతేడాది ప్రతిపాదనలు పంపినా నిధులు మంజూరు కాలేదు. ఈ ఏడాది జూరాల ఎడమ కాల్వ, రామన్‌పాడు కుడికాల్వ గేట్ల మరమ్మతులు, చిన్న చిన్న పనుల కోసం రూ.1.20 కోట్లతో ప్రతిపాదనలు సిద్ధం చేసి ఉన్నతాధికారులకు పంపించాం. నిధులు మంజూరైతే పంట కోతలు పూర్తవగానే పనులు ప్రారంభిస్తాం.
– జగన్మోహన్, ఈఈ,
జూరాల ఎడమకాల్వ సబ్ డివిజన్
దెబ్బతిన్న జూరాల ఎడమ, రామన్‌పాడు కుడి కాల్వ గేట్లు.. లైనింగ్
వేసవిలో పనులు చేపట్టేందుకు
అధికారుల సన్నాహాలు

మరమ్మతు..

మరమ్మతు..

మరమ్మతు..

మరమ్మతు..