
నిందితులకు శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలి
మహబూబ్‌నగర్ న్యూటౌన్: జిల్లాలో నమోదవుతున్న ప్రతి నేరానికి సంబంధించిన కేసుల్లో పారదర్శకంగా సమగ్రమైన విచారణ చేపట్టి నిందితులకు శిక్షలు పడే శాతాన్ని పెంచే దిశగా కృషి చేయాలని ఎస్పీ జానకి పోలీస్ అధికారులకు సూచించారు. బుధవారం జిల్లా ఎస్పీ కార్యాలయంలోని సమావేశ మందిరంలో సర్కిల్ వారీగా పోలీస్ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ప్రతి కేసును ప్రాధాన్యతతో సమగ్రంగా విచారించాలని సూచించారు. పోలీస్‌స్టేషన్ వారీగా గ్రేవ్, నాన్–గ్రేవ్, యూఐ కేసుల వివరాలను సమీక్షించి.. యూఐ కేసులు విచారణ దశలోనే నిలిచిపోతున్నాయనే విషయంపై ఆరా తీశారు. వాటిని త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు, పోక్సో కేసుల పురోగతిని సమీక్షిస్తూ ఈ కేసుల్లో నిందితులకు గరిష్టంగా శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలన్నారు. బాధితులకు కేసుల పురోగతిని ఎప్పటికప్పుడు తెలియజేస్తూ నిందితులకు శిక్షల శాతం పెంచేలా పని చేయాలన్నారు. మహిళలపై జరిగే నేరాలు, ముఖ్యంగా పోక్సో కేసులపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. దొంగతనాల కేసులను ఛేదించడంలో ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్లాలని సూచించారు. నిందితులను లోతుగా విచారించేందుకు తగిన కృషి జరగాలన్నారు. ఎఫ్‌ఎస్‌ఎల్ నివేదికలు, అరెస్టులు వంటి అంశాలు పెండింగ్‌లో లేకుండా చూసుకోవాలన్నారు. ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులపై వెంటనే స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని, ప్రజల్లో పోలీసులపై నమ్మకం పెంచే విధంగా ముందుకు సాగాలన్నారు. సమావేశంలో ఏఎస్పీ రాములు, ఏఆర్ ఏఎస్పీ సురేష్‌కుమార్, డీఎస్పీ వెంకటేశ్వర్లు, డీసీఆర్బీ డీఎస్పీ రమణారెడ్డి, సీఐలు వెంకటేశ్, అప్పయ్య, ఇజాజుద్దీన్, కమలాకర్, నాగార్జునగౌడ్, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.