
ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకోండి
మహబూబ్‌నగర్ ఎడ్యుకేషన్: కానిస్టేబుల్, ఎస్సై, వీఆర్వో వంటి ఉద్యోగాలు పొందేందుకు యువతకు ఉచితంగా అందిస్తున్న శిక్షణ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి పేర్కొన్నారు. ఈమేరకు జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ కళాభవన్‌లో నిరుద్యోగ యువతకు ఎమ్మెల్యే తన సొంత నిధులతో ఏర్పాటు చేసిన శిక్షణ కార్యక్రమాన్ని ఆయన రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్ మహ్మద్ రియాజ్‌తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హైదరాబాద్‌లోని అశోక్‌నగర్, దిల్‌సుఖ్‌నగర్‌లో ఉండే కోచింగ్ సెంటర్‌లకు ధీటుగా కోచింగ్ ఇస్తామని, అందుకోసం అనుభవజ్ఞులైన హైదరాబాద్ ఫ్యాకల్టీ ద్వారా శిక్షణ ఇప్పిస్తామని, త్వరలో ప్రభుత్వం వేలాది ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇవ్వనున్న క్రమంలో యువత శిక్షణలో పాల్గొనాలని తెలిపారు. శిక్షణ వచ్చే వారికి అన్ని రకాల వసతులు కల్పిస్తామని, స్టడీ మెటీరియల్ ఉచితంగా అందిస్తామన్నారు. రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్ మహ్మద్ రియాజ్ మాట్లాడుతూ నిరుద్యోగ యువత భవిష్యత్ కోసం ఎమ్మెల్యే ఎంతో కృషి చేస్తున్నారని, వారు ఉచితంగా శిక్షణ ఇవ్వడం చాలా సంతోషకరమైన విషమం అన్నారు. ఈ అవకాశాన్ని యువత అందిపుచ్చుకోవాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లు నర్సింహారెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ ఆనంద్‌గౌడ్, గుండా మనోహర్, శ్రీనివాస్‌యాదవ్, ఆవేజ్, తదితరులు పాల్గొన్నారు.