చిన్నచింతకుంట: పేదల తిరుపతిగా విరాజిల్లుతున్న కురుమూర్తిస్వామి ఆలయంలో భక్తులకు కనీస సౌకర్యాలు కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అందులో భాగంగా భక్తులకు తాగునీటి వ్యథ తీర్చేందుకు రూ. 36లక్షలతో చేపట్టిన తాగునీటి సంపు నిర్మాణ పనులు తుది దశకు చేరుకున్నాయి. మిషన్ భగీరథ పథకంలో భాగంగా 2లక్షల కిలో లీటర్ల సామర్ధ్యంగల సంపు నిర్మాణ పనులను మూడు నెలల క్రితం డీఎంఎఫ్‌టీ నిధులతో చేపట్టారు. ప్రస్తుతం సంపు నిర్మాణం తుది దశలో ఉంది. ఈ నిర్మాణం పూర్తయితే మిషన్ భగీరథ నీటిని సంపులో నింపి.. జాతర మైదానంలోని వాటర్ ట్యాంక్‌లకు నీటిని తరలిచేందుకు పైపులైన్ ఏర్పాటు చేయనున్నారు. వాటర్ ట్యాంకుల నుంచి జాతర మైదానం, ఆలయ ప్రాంగణంలో అవసరమైన చోట కొళాయిలను ఏర్పాటుచేసి.. తాగునీటిని అందించనున్నారు. ఇందుకు సంబంధించి కలెక్టర్ విజయేందిర, ఎమ్మెల్యే జి.మధుసూదన్‌రెడ్డి చొరవతో పనులు వేగంగా సాగుతున్నాయి.
● కురుమూర్తిస్వామి బ్రహ్మోత్సవాలకు ప్రతి సంవత్సరం దాదాపు 10లక్షల మంది భక్తులు తరలివస్తారు. అయితే ఆలయం వద్ద 90వేల సామర్ధ్యంగల రెండు వాటర్ ట్యాంకులు మాత్రమే ఉండటంతో నీరు సరిపోక భక్తులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యేవారు. ఆలయ పరిసరాల్లో ఉన్న చేతిపంపులు, సమీప వ్యవసాయ పొలంలో ఉన్న బోరుబావుల వద్దకు వెళ్లి నీటిని తెచ్చుకునే వారు. మరోవైపు భక్తులకు తాగునీటి వసతి కోసం అధికారులు నానా తంటాలు పడే వారు. సమీపంలోని గ్రామపంచాయతీల నుంచి వాటర్ ట్యాంకర్లతో పాటు ఊకచెట్టు వాగు నుంచి బోరు పంపులను ఏర్పాటుచేసి నీటి వసతి ఏర్పాటు చేసేవారు. అయినప్పటికీ నీటి కొరత తీరేది కాదు. ప్రస్తుతం చేపట్టిన వాటర్ సంపు నిర్మాణంతో ఇబ్బందులు తీరనున్నాయి.
కురుమూర్తిస్వామి ఆలయ ప్రాంగణంలో రూ. 36లక్షలతో సంపు నిర్మాణం
తుది దశలో పనులు