జడ్చర్ల టౌన్: మహారాష్ట్రలోని సద్గురు గంగజీర్ మహారాజ్ సైన్స్ అండ్ ఆర్ట్స్ కళాశాలకు చెందిన పరిశోధకులు డా. నిలేష్ మాల్పూరి, డా. బండారి తర్హాల్, గోసావి, కై లార్ మంగళవారం పట్టణంలోని డా. బీఆర్‌ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలోని బొటానికల్ గార్డెన్‌ను సందర్శించారు. వారికి ప్రిన్సిపాల్ డా. సుకన్య, బొటానికల్ గార్డెన్ సమన్వయకర్త డా. సదాశివయ్య స్వాగతం పలికారు. గార్డెన్‌తో పాటు స్టేట్ హెర్బేరియంను సందర్శించిన వారు ఆకాంతేసి, యుఫర్బియేసి కుటుంబాలకు చెందిన మొక్కలను పరిశీలించారు. ఈ సందర్బంగా డా. నిలేశ్ మాల్పూరి మాట్లాడుతూ.. పరిశోధక విద్యార్థులు దక్షిణ భారతదేశంలోని డైక్లిప్టేరా యుఫోర్బియా ప్రజాతులపై పరిశోధన చేస్తున్నారని, అందులో భాగంగానే ఇక్కడి స్టేట్ హెర్బేరియం, బొటానికల్ గార్డెన్‌ను సందర్శించామన్నారు. ఇక్కడ భద్రపర్చిన మొక్కల నమూనాలు పరిశోధనకు ఎంతో ఉపయోగకరంగా ఉన్నాయని తెలిపారు. తమ పరిశోధన గ్రంథంలో కళాశాల పేరును ప్రస్తావిస్తామన్నారు.