పాము కాటుకు వ్యక్తి బలి
చిన్నచింతకుంట: పాము కాటుకు గురై ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన కౌకుంట్ల మండలం తిర్మలాపూరంలో మంగళవారం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు..గ్రామానికి చెందిన గుడికాడి నాగేష్ ( 40) సోమవారం రాత్రి తన ఇంట్లో నిద్రిస్తుండగా కట్ల పాము కాటేసింది. గమనించిన నాగేష్ నిద్రలేచి పామును చంపాడు. కుటుంబ సభ్యులతో కలిసి చికిత్స నిమిత్తం ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వెళ్లారు. అక్కడ వైద్యులు లేకపోవడంతో ఆత్మకూర్ ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లగా అక్కడి వైద్యులు వనపర్తి ప్రభుత్వాస్పత్రికి రెఫర్ చేశారు.పరిస్థితి విషమించడంతో అక్కడినుంచి మహబూబ్‌నగర్ ప్రభుత్వాస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ కోలుకోలేక మృతిచెందాడు. మృతుడికి భార్య, ముగ్గురు కూతుళ్లు ఉన్నారు.
బిహార్‌వాసి బలవన్మరణం
వెల్దండ: మండలంలోని రాచూర్‌తండా సమీపంలో బిహార్‌కు చెందిన మోహిత్‌కుమార్ పాశ్వన్ (19) సోమవారం అర్ధరాత్రి ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు ఏఎస్‌ఐ జాకీర్ ఉల్లా తెలిపారు. ఆయన కథనం మేరకు.. బిహార్ రాష్ట్రం ఔరంగాబాద్ జిల్లా కుదుమా మండలం కస్తూరిపూర్తికి చెందిన మోహిత్‌కుమార్ పాశ్వన్ రాచూర్ సమీపంలోని వింటేజ్ కాఫీ కంపెనీలో 20 రోజులుగా పని చేస్తున్నాడు. రోజులాగే సోమవారం రాత్రి భోజనం అనంతరం రాచూర్‌తండాలో సమీపంలో వారు ఉండే షెడ్‌కు వచ్చి ఆరుబయట పడుకున్నాడు. అర్ధరాత్రి రాత్రి దాటాక షెడ్‌లోని ఇనుప రాడ్‌కు ఊరేసుకున్నాడు. మంగళవారం ఉదయం తోటి కూలీలు షెడ్ వద్దకు వచ్చే సరికి చనిపోయి కనిపించడంతో వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటన స్థలాన్ని సీఐ విష్ణువర్ధన్‌రెడ్డి పరిశీలించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కల్వకుర్తి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్‌ఐ వివరించారు.
చెక్‌డ్యాంలో ఈతకు వెళ్లి వ్యక్తి మృతి
గోపాల్‌పేట: చెక్‌డ్యాంలో ఈతకు వెళ్లిన ఓ వ్యక్తి ఒడ్డుకు చేరుకోలేక మృతిచెందాడు. ఎస్‌ఐ నవీన్‌కుమార్ కథనం ప్రకారం.. వనపర్తికి చెందిన ఆవుల శ్రీను(40) ఈ నెల 23న గోపాల్‌పేట మండలంలోని మున్ననూరులో బంధువుల ఇంటికి వచ్చాడు. ఇంటి వద్ద ఎవరూ లేకపోవడంతో గ్రామ శివారులోని కొత్తబావి చెక్‌డ్యాంలో ఈత పడేందుకు వెళ్లాడు. అయితే అప్పటికే మద్యం తాగి ఉండటంతో నీటిలోంచి ఒడ్డుకు ఈదలేక మునిగిపోయి మృతిచెందాడు. కుటుంబ సభ్యులు సోమవారం చెక్‌డ్యాంలో గాలించిన ఫలితం లేకపోయింది. మంగళవారం చెక్‌డ్యాంలో మృతదేహం పైకి తేలడంతో గ్రామస్తులు పోలీసులకు సమాచారం ఇవ్వగా వారు వచ్చి మృతదేహాన్ని బయటికి తీసి పరిశీలించారు. వనపర్తికి చెందిన ఆవుల శ్రీనుగా గుర్తించి వారి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. ఈ ఘటనపై ఆవుల శ్రీను భార్య ఆవుల విజయలక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ చెప్పారు.
మద్యం మత్తులో
కిందపడి..
గద్వాల: మద్యం మత్తులో కిందపడి ఓ వ్యక్తి మృతిచెందిన ఘటన మంగళవారం తెల్లవారుజామున ధరూరు మండల కోతుగిద్దె సమీపంలో చోటుచేసుకున్నట్లు ఎస్‌ఐ శ్రీహరి తెలిపారు. వివరాలు.. గద్వాలకి చెందిన దర్శెల్లి అనే వ్యక్తి కోతులగెద్దె సమీపంలో రోడ్డు పక్కనే మద్యం మత్తులో అదుపు తప్పి కింద పడ్డాడు. తలకిందలుగా పడిపోవడంతో పైకి లేవలేక ఊపిరాడక మృతిచెందినట్లు ఎస్‌ఐ తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గద్వాల ఆస్పత్రికి కేసు నమోదు చేశామన్నారు.
యువతిపై కేసు నమోదు
కోస్గి: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సోదరుడు, కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్‌చార్జి తిరుపతిరెడ్డి ఈ నెల 22న కోస్గి మండలంలో పర్యటన సందర్భంగా అనుచిత వ్యాఖ్యలు చేసిన యువతిపై మంగళవారం కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ బాలరాజ్ తెలిపారు. మండల పర్యటనలో భాగంగా బిజ్జారం గ్రామంలో భోజనం చేసేందుకు పార్టీ నాయకులు, అధికారులతో కలిసి తిరుపతిరెడ్డి వెళ్లగా.. హన్మాన్‌పల్లికి పద్మ ముఖ్యమంత్రి సోదరుడు భూకబ్జాలు చేయడానికి వచ్చాడంటూ వాట్సప్ గ్రూపుల్లో ప్రచారం చేసినట్లు పేర్కొన్నారు. నిరాధారమైన ఆరోపణలతో పాటు తప్పుడు ప్రచారం చేసిన యువతిపై ఎన్‌ఎస్‌యూఐ అధ్యక్షుడు అశోక్ పిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు.
చిరుత దాడిలో లేగ మృతి
కొత్తపల్లి: చిరుత దాడిలో లేగ మృతిచెందిన ఘటన మండలంలోని గోకుల్‌నగర్‌లో సోమవారం రాత్రి చోటు చేసుకుంది. బాధిత రైతు కావలి గోవిందు కథనం మేరకు.. గ్రామ శివారులోని వ్యవసాయ పొలం వద్ద రోజువారీగా సోమవారం రాత్రి పశువులను కట్టేసి ఇంటికి వెళ్లాడు. మంగళవారం ఉదయం పొలానికి వెళ్లి చూడగా లేగ మృతిచెంది కనిపించింది. చిరుత దాడితోనే మృతి చెందినట్లు బాధితుడు వివరించారు. ఈ విషయాన్ని అటవీశాఖ అధికారి వద్ద ప్రస్తావించగా.. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు బోను ఏర్పాటు చేస్తామని.. చుట్టుపక్కల గ్రామాల రైతులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.