మహబూబ్‌నగర్ క్రీడలు: బిహార్ రాష్ట్రం గయా జిల్లాలో ఈ నెల 27 నుంచి 30వ తేదీ వరకు జరగనున్న 34వ సబ్ జూనియర్ నేషనల్ కబడ్డీ పోటీలకు జిల్లాలోని అడ్డాకుల మండలం తిమ్మాయిపల్లి తండాకు చెందిన జె.సురేష్ ఎంపికయ్యాడు. ఇటీవల వికారాబాద్‌లో జరిగిన సబ్ జూనియర్ రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీల్లో మెరుగైన ప్రతిభ కనబరిచి జాతీయస్థాయి పోటీలకు ఎంపికయ్యాడు. సురేష్ మొదటిసారిగా తెలంగాణ రాష్ట్ర జట్టులో చోటు దక్కించుకున్నాడు. సురేష్ ఎంపికపై జిల్లా కబడ్డీ సంఘం అధ్యక్షులు బి.శాంతికుమార్, ప్రధాన కార్యదర్శి ఈ.కురుమూర్తిగౌడ్, ఉపాధ్యక్షులు శ్రీధర్‌రెడ్డి, దామోదర్‌రెడ్డి, కార్యనిర్వాహక కార్యదర్శులు ఆర్.బాల్‌రాజు, పాపారాయుడు హర్షం వ్యక్తం చేశారు.
దొంగకు రిమాండ్
తాడూరు: మండలంలోని ఆకునెల్లికుదురు రామలింగేశ్వరస్వామి ఆలయంలో హుండీ చోరీకి పాల్పడిన దొంగను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఎస్‌ఐ గురుస్వామి వివరాల మేరకు.. ఆకునెల్లికుదురు రామలింగేశ్వరస్వామి ఆలయంలో హుండీ డబ్బులను చోరీ చేసినట్లు గ్రామస్తులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు విచారణ చేపట్టిన పోలీసులు.. మంగళవారం మేడిపూర్, నెల్లికుదురు మార్గంలో అనుమానాస్పందంగా తిరుగుతున్న కల్వకుర్తి మండలం సుద్దకల్లుకు చెందిన బక్కయ్యను అదుపులోకి తీసుకున్నారు. తమదైన శైలిలో అతడిని విచారించడంతో చేసిన నేరాన్ని ఒప్పుకొన్నాడని.. అతడిని కోర్టులో హాజరుపర్చగా, రిమాండ్‌కు ఆదేశించినట్లు ఎస్‌ఐ తెలిపారు.
అనుమానాస్పదంగా యువకుడి మృతి
జడ్చర్ల: మండలంలోని మంగలికుంటతండాలో ఓ యువకుడు అనుమానాస్పదంగా మృతిచెందినట్లు సీఐ కమలాకర్ తెలిపారు. వివరాలు.. రాజాపూర్ మండలం సోమ్లనాయక్‌తండాకు చెందిన పాత్లావత్ మహేశ్(26)కు జడ్చర్ల మండలం మంగలికుంటతండాకు చెందిన పద్మతో ఏడాదిన్నర క్రితం వివాహమైంది. వీరికి ఒక కుమారుడు ఉండగా మూడునెలల క్రితం భర్తతో గొడవపడిన భార్య పద్మ తన కుమారుడిని తీసుకొని పుట్టింటికి వెళ్లింది. దీంతో మహేశ్ కూడా అత్తగారింటికి వచ్చి ఇక్కడే ఉంటున్నాడు. ఈక్రమంలో భార్య పద్మతో పాటు కుటుంబసభ్యులు మహేశ్‌తో గొడవపడి కొట్టేవారు. సోమవారం ఇంట్లో ఫ్యాన్ కొండికి ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు భార్య కుటుంబీకులు మహేశ్ తల్లికి సమాచారమిచ్చారు. మంగళవారం ఆమె కుమారుడి మృతదేహాన్ని పరిశీలించి మరణంపై అనుమానం ఉందని, సమగ్ర విచారణ జరపాలని పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈమేరకు కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు.
వ్యక్తి అదృశ్యం
కల్వకుర్తి టౌన్: వ్యక్తి అదృశ్యమైన ఘటనలో మంగళవారం కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ మాధవరెడ్డి తెలిపారు. ఎస్‌ఐ తెలిపిన వివరాల ప్రకారం పట్టణంలోని గాంధీనగర్ కాలనీకి చెందిన రుక్నుద్దీన్ అప్పులు ఎక్కువయ్యాయని చెప్పి గతేడాది డిసెంబర్‌లో ఇంటి నుంచి వెళ్లిపోయాడు. బంధువుల ఇళ్ల వద్ద, ఇతర ప్రాంతాలలో ఎంత వెతికినా అతని ఆచూకీ లభించలేదు. బాధితుడి తండ్రి జహంగీర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్‌ఐ తెలిపారు.