
ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులో వ్యక్తికి జీవిత ఖైదు
ధరూరు: ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులో ఓ వ్యక్తికి రూ.10 వేల జరిమానాతోపాటు జీవిత ఖైదు విధించినట్లు ఎస్‌ఐ శ్రీహరి తెలిపారు. ఎస్‌ఐ కథనం ప్రకారం.. ధరూరుకు చెందిన మాల బీసమ్మ కూలీ పనలు చేసుకుని జీవనం సాగిస్తుండేది. ఆమె అప్పట్లో చాకలి వెంకటన్న వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడు. అయితే సదరు మహిళ మరో ఇద్దరు వ్యక్తులతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నావని దూషించడంతో.. మనస్తాపానికి గురైన ఆమె ఇంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకొని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ మేరకు అప్పటి డీఎస్పీ బాలకోటి, సీఐ సురేష్, ఏఎస్‌ఐ విశ్వనాథం చాకలి వెంకటన్నపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమొదు చేశారు. ఈ మేరకు శుక్రవారం మహబూబ్‌నగర్‌లోని ప్రత్యేక ఎస్సీ, ఎస్టీ కోర్టులో కేసుపై విచారణ జరగగా.. న్యాయమూర్తి శారదదేవి నిందితుడు చాకలి వెంకటన్నకు రూ.10 వేల జరిమానాతోపాటు జీవిత ఖైదు విధిస్తూ తీర్పు వెలువరించినట్లు ఎస్‌ఐ చెప్పారు.
పెట్రోల్ బంక్‌లో చోరీ
మల్దకల్: మండంలోని అమరవాయి గ్రామ సమీపంలో ఇటీవల ఏర్పాటుచేసిన పద్మావతి పెట్రోల్ బంక్‌లో గురువారం అర్ధరాత్రి గుర్తుతెలియని దుండగులు చోరీకి పాల్పడ్డారు. పెట్రోల్ బంక్ నిర్వాహకుల వివరాల మేరకు.. బొలెరో వాహనంలో వచ్చిన ఏడుగురు పెట్రోల్ బంక్‌లో పనిచేస్తున్న యువకులను ఓ గదిలో నిర్బంధించి, రూ. 1.42లక్షలను చోరీ చేశారు. అదే విధంగా సీసీ కెమెరాలు, కంప్యూటర్లు, ఫర్నిచర్‌ను ధ్వంసం చేశారు. వాటి విలువ రూ. లక్షకు పైగా ఉంటుందని పెట్రోల్ బంక్ యజమాని గంగాధర్ తెలిపారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఘటన స్థలాన్ని గద్వాల సీఐ టంగుటూరు శ్రీను, ఎస్‌ఐ పరిశీలించారు.
నర్సింగ్ విద్యార్థి బలవన్మరణం
రాజాపూర్ (బాలానగర్): చదువు పూర్తి చేసుకుని తమకు అండగా నిలుస్తాడనుకున్న కుమారుడు ఆత్మహత్య చేసుకోవడంతో ఆ తల్లిదండ్రులు తల్లడిల్లిపోయారు. ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా.. బాలానగర్‌కు చెందిన చరమోని శివరాజ్ ఆటో నడుపుతూ ఇద్దరు కూతుళ్లు, కుమారుడు మనిదీప్(18)ను చదివించుకుంటున్నాడు. అయితే మనిదీప్ హైదరాబాద్‌లో ఓ యునివర్సిటీలో నర్సింగ్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. గురువారం కళాశాలకు వెళ్లి వచ్చి రాత్రి కుటుంబ సభ్యులతో కలిసి భోజనం చేసిన అనంతరం తన రూంలోకి వెళ్లి పడుకున్నాడు. ఉదయం ఎంతకీ పిలిచినా లేవకపోవడంతో కుటుంబ సభ్యులు తలుపులను పగులగొట్టి చూడగా ఫ్యాన్‌కు చీరతో ఉరివేసుకుని మృతిచెందాడు. ఈ ఘటనపై తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు బాలానగర్ ఎస్‌ఐ లెనిన్‌గౌడ్ తెలిపారు.
రైలు ఢీకొని వ్యక్తి మృతి
ఆత్మకూర్: ప్రమాదవశాత్తు రైలు ఢీకొని వ్యక్తి మృతి చెందిన ఘటన ఆత్మకూర్ మండలం ఆరేపల్లి సమీపంలో గురువారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. రైల్వే హెడ్‌కానిస్టేబుల్ అశోక్ వివరాల మేరకు.. ఆరేపల్లికి చెందిన గొళ్ల వెంకటేష్ (44) గ్రామ సమీపంలోని రైలు పట్టాలు దాటుతుండగా.. గుర్తుతెలియని రైలు ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న రైల్వే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గద్వాల మార్చురీకి తరలించారు.
చిరుత దాడిలో లేగ మృతి
మద్దూరు: పట్టణ శివారులో వారం రోజులుగా చిరుత సంచారం కొనసాగుతోంది. గురువారం రాత్రి తలారి రాములు ఎలగల గట్టు దగ్గర ఉన్న తన పొలంలో పశువులను కట్టివేసి ఇంటికి వచ్చాడు. అదేరోజు రాత్రి చిరుత దాడిచేయడంతో లేగ మృతిచెందింది.