
తమ్ముడి ప్రేమకు సహకరించాడనే నెపంతో..
దేవరకద్ర రూరల్: ప్రేమ విషయంలో తమ్ముడికి సహకరించాడనే నెపంతో యువతి తరఫు బంధువులు మరణాయుధాలతో దాడి చేసిన ఘటన దేవరకద్ర మండలం పెద్దరాజమూర్‌లో శుక్రవారం చోటు చేసుకుంది. పోలీసులు, స్థానికుల వివరాల మేరకు.. పెద్దరాజమూర్‌కు చెందిన అరుణ్ కుమార్‌కు రెండేళ్ల క్రితం మణికొండకు చెందిన యువతితో వివాహం కాగా.. అనారోగ్య కారణాలతో ఆమె ఏడాది క్రితం మృతిచెందింది. అయితే ఐదు నెలల క్రితం గూరకొండకు చెందిన అమ్మాయితో అరుణ్‌కుమార్ ప్రేమాయాణం నడుపుతూ ఇంటికి తీసుకువచ్చాడు. అతడి వేధింపులు తాళలేక ఆమె తిరిగి వెళ్లిపోయింది. ఇదిలా ఉంటే, మూడు నెలల క్రితం పెద్దరాజమూర్‌కు చెందిన మరో అమ్మాయిని ప్రేమ పేరుతో తీసుకెళ్లాడు. అమ్మాయి తరఫు బంధువులు వారిని వెతికి తీసుకువచ్చి.. పది రోజుల క్రితం గ్రామ పెద్దల సమక్షంలో పంచాయితీ పెట్టారు. యువకుడికి ఇంతకుముందే వివాహం జరగడంతో యువతి తరఫు వారు పెళ్లికి ఒప్పుకోలేదు. చేసిన తప్పునకు గాను యువతి కుటుంబానికి జరిమానా చెల్లించాలని సదరు యువకుడి కుటుంబానికి పెద్దలు సూచించారు. అయినప్పటికీ ఆ యువకుడి ప్రవర్తనలో మార్పు కనిపించక పోవడంతో శుక్రవారం యువతి కుటుంబానికి చెందిన తాత ఆంజనేయులు, తండ్రి మైబు, బాబాయ్ మాధవులు మరణాయుధాలతో యువకుడి ఇంటిపైకి వెళ్లారు. ఆ సమయంలో ఇంట్లో అరుణ్‌కుమార్ అన్న రవికుమార్ ఒక్కడే ఉన్నాడు. అయితే జరిగిన ఘటనలో రవికుమార్ పాత్ర కూడా ఉందని ఆరోపిస్తూ అతడిపై మరణాయుధాలతో దాడి చేశారు. ఈ ఘటనలో బాధితుడి తల, భుజం వద్ద తీవ్రగాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని బాధితుడిని చికిత్స నిమిత్తం జిల్లా ఆస్పత్రికి తరలించారు. సీఐ రామకృష్ణ గ్రామానికి చేరుకుని వివరాలు తెలుసుకున్నారు. బాధితుడి భార్య భాగ్యమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్‌ఐ నాగన్న తెలిపారు. దాడికి పాల్పడిన ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. కాగా, బాధితుడిని జిల్లా ఆస్పత్రిలో ఎమ్మార్పీఎస్ దక్షిణ తెలంగాణ అధ్యక్షుడు మల్లెపోగు శ్రీనివాస్, వర్కింగ్ ప్రెసిడెంట్ జంబులయ్య, దొబ్బలి ఆంజనేయులు పరామర్శించారు.
అన్నపై మరణాయుధాలతో
యువతి బంధువుల దాడి

తమ్ముడి ప్రేమకు సహకరించాడనే నెపంతో..