
వైభవంగా పాలమూరు ఉగాది ఉత్సవాలు
స్టేషన్ మహబూబ్‌నగర్: ఉగాది పర్వదినం సందర్భంగా సుద్దాల హనుమంతు సాంస్కృతిక వేదిక ఆధ్వర్యంలో జిల్లాకేంద్రంలోని అంబేడ్కర్ కళాభవన్‌లో ఆదివారం రాత్రి పాలమూరు ఉగాది ఉత్సవాలు వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థుల నృత్య ప్రదర్శనలు అందరినీ అలరించాయి. సాంస్కృతిక వేదిక సభ్యులతోపాటు పలువురు ప్రముఖులు తెలుగుదనం ఉట్టిపడేలా వస్త్రధారణలతో కనువిందు చేశారు. ఈ సందర్భంగా సుద్దాల హనుమంతు సాంస్కృతిక గౌరవాధ్యక్షుడు డాక్టర్ మధుసూదన్‌రెడ్డి మాట్లాడుతూ ఆత్మీయత, అనుబంధాలు ఆనందానికి కేంద్రంగా నిలుస్తాయని, ప్రస్తుత పరిశోధనలు వెల్లడిస్తున్నాయన్నారు. విదేశీ విష సంస్కృతి అధికమవుతోందని, మన సంస్కృతిలోని మాధుర్యాన్ని పెంపొందించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలంగాణ సంగీత నాటక అకాడమీ మాజీ చైర్మన్ బాద్మి శివకుమార్ అన్నారు. కార్యక్రమం మధ్యలో కవులు ఆలపించిన కవితలు ఆలోచనలు రేకెత్తించాయి. జానపద కళాకారులు, శాసీ్త్రయ నృత్య ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. పలువురు గాయకులు ఆలపించిన పాటలు ప్రేక్షకులను మంత్రముగ్ధుల్ని చేశాయి. ప్రదర్శనలు చేసిన ప్రతి కళాకారునికి జ్ఞాపికలను అందజేశారు. కార్యక్రమంలో సుద్దాల హనుమంతు సాంస్కృతిక వేదిక జిల్లా అధ్యక్షుడు బెక్కం జనార్దన్, వి.కురుమూర్తి, కార్యవర్గ సభ్యులు కుర్మయ్య తదితరులు పాల్గొన్నారు.
అలరించిన నృత్యాలు, పాటలు, కవితాగానాలు

వైభవంగా పాలమూరు ఉగాది ఉత్సవాలు