
‘ఎంఆర్‌ఐ’ ఏర్పాటు ఎప్పుడో?
పాలమూరు: జిల్లా జనరల్ ఆస్పత్రిలో ఉగాది నాటికి ఎంఆర్‌ఐ సేవలను అందుబాటులోకి తీసుకువస్తామని రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదార రాజనర్సింహ ఇచ్చిన మాట నెరవేరడం లేదు. మంత్రి ప్రకటించి దాదాపు మూడు నెలలు గడుస్తున్నా ఇప్పటి వరకు ఎంఆర్‌ఐ మిషన్ ఏర్పాటుపై ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. కనీసం భవన పరిశీలన కానీ, ఎక్కడ ఏర్పాటు చేయాలనే విషయంపై నిర్ణయం సైతం జరగలేదు. అసలు ఎంఆర్‌ఐ సేవలు ఎన్నాళ్లకు అందుబాటులోకి వస్తాయో తెలియని పరిస్థితి నెలకొంది. జిల్లా జనరల్ ఆస్పత్రిలో ఎంఆర్‌ఐ సేవలు అందుబాటులోకి వస్తే ఉమ్మడి జిల్లాలోని పేదలకు ఎంతో మేలు చేకూరుతుంది.
మరమ్మతుకు నోచుకోని సీటీ స్కాన్ మిషన్..
జనరల్ ఆస్పత్రిలో కొత్తగా ఏర్పాటుచేసే ఎంఆర్‌ఐ జాడ లేకపోయినా.. మరమ్మతుకు గురైన సీటీ స్కాన్ మిషన్ అయినా బాగు చేయించాలని రోగులు కోరుతున్నారు. సీటీ స్కాన్ మరమ్మతుకు దాదాపు రూ. 39లక్షల వరకు వెచ్చించాల్సి ఉండటంతో నిధులు లేక అలాగే వదిలేశారు. ఈ విషయంపై మంత్రులు, ఎమ్మెల్యేలు, ఉన్నతస్థాయి అధికారులకు విన్నవించినా బాగు చేయడానికి నిధులు కేటాయించడం లేదు. ప్రధానంగా రోడ్డు ప్రమాదంలో గాయపడి సీరియస్‌గా ఉన్న క్షతగాత్రులతో పాటు జబ్బు తీవ్రత తెలుసుకోవడానికి సీటీ స్కాన్ అవసరం పడుతుంది. అలాంటి సీటీ స్కాన్ మిషన్ కొన్ని రోజులుగా మరమ్మతుకు నోచుకోవడం లేదు. ఫలితంగా పేద రోగులకు ఇబ్బందులు తప్పడం లేదు. నిత్యం పదుల సంఖ్యలో సీటీ స్కాన్ కోసం ప్రైవేటు స్కానింగ్ సెంటర్లను ఆశ్రయించి రూ. 2వేల నుంచి రూ. 3వేల వరకు వెచ్చిస్తున్నారు. ఇక రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ఆస్పత్రికి వచ్చిన క్షతగాత్రులకు సీటీ స్కానింగ్ అవసరమైతే వైద్యులు బయటకు రెఫర్ చేస్తున్నారు దీంతో గాయాలతో బయటకు వెళ్లి స్కానింగ్ చేసుకొని రావడానికి నానా తంటాలు పడుతున్నారు. ఈ విషయంపై జనరల్ ఆస్పత్రి సూపరింటెండెంట్ డా.సంపత్‌కుమార్‌ను వివరణ కోరగా.. ఆస్పత్రిలో ఎంఆర్‌ఐ మిషన్ తప్పనిసరిగా ఏర్పాటు అవుతుందన్నారు. అందుకు ఇంకా కాస్త సమయం పడుతుందని తెలిపారు. ఇక సీటీ స్కాన్ మరమ్మతు విషయాన్ని ఇటీవల అసెంబ్లీలో ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారని.. ఆ వెంటనే ఆరోగ్యశాఖ మంత్రి పేషి నుంచి ఫోన్ రావడంతో సీటీ స్కాన్ మరమ్మతుకు అయ్యే ఖర్చు వివరాలను అందించినట్లు చెప్పారు. త్వరలో మరమ్మతు చేసే అవకాశం ఉందన్నారు.
జిల్లా జనరల్ ఆస్పత్రిలో ఉగాది నాటికి ఏర్పాటు చేస్తామన్న వైద్యారోగ్యశాఖ మంత్రి
ఇప్పటి వరకు భవన పరిశీలనకు నోచుకోని వైనం