
7 నుంచి చిన్నారులకుకంటి పరీక్షలు
పాలమూరు: జిల్లాలో ఈ నెల 7 నుంచి 0–6 ఏళ్ల ఉన్న చిన్నారులకు కంటి పరీక్షలు చేయడానికి కార్యాచరణ సిద్ధం చేశామని, మొత్తం 1,163 అంగన్‌వాడీల పరిధిలో 51,772 మంది చిన్నారులను గుర్తించినట్లు డీఎంహెచ్‌ఓ డాక్టర్ కృష్ణ వెల్లడించారు. జిల్లా జనరల్ ఆస్పత్రిలో శుక్రవారం సూపరింటెండెంట్ డాక్టర్ సంపత్‌కుమార్ సింగ్‌తో కలిసి ఇతర అధికారులతో సమావేశం నిర్వహించారు. జిల్లాలో ప్రతి చిన్నారికి కంటి పరీక్ష నిర్వహించి ఏదైనా సమస్య ఉంటే చికిత్స చేయాల్సిన అవసరం ఉందన్నారు. 2024లో 12,674మంది చిన్నారులకు కంటి పరీక్షలు చేసి 786 మందికి సమస్య ఉన్నట్లు గుర్తించినట్లు తెలిపారు. రెండో దశ 2024 ఆగస్టులో 46,415 మందికి పరీక్షలు చేయగా 1,486 మందికి కంటి సమస్య ఉన్నట్లు నిర్ధారించినట్లు తెలిపారు. ఈ ఏడాది ఎంపిక చేసిన లక్ష్యంలో ప్రతి ఒక్కరికి పరీక్షలు నిర్వహించి సర్జరీ అవసరమైన చిన్నారులతో పాటు చికిత్స కావాల్సిన వారికి అందించనున్నట్లు పేర్కొన్నారు. డీఐఓ డాక్టర్ పద్మజ, జిల్లా మాస్‌మీడియా అధికారిని మంజుల, ప్రవీణ్‌కుమార్, సుభాష్ చంద్రబోస్, దేవిదాస్ పాల్గొన్నారు.