
బస్సు, బైక్ ఢీ : ఒకరి దుర్మరణం
వెల్దండ: మండలంలోని పెద్దాపూర్ స్టేజీ వద్ద హైదరాబాద్–శ్రీశైలం జాతీయ రహదారిపై మంగళవారం బస్సు, బైక్ ఢీకొని ఓ వ్యక్తి మృతి చెందినట్లు ఎస్‌ఐ కురుమూర్తి తెలిపారు. ఆయన కథనం మేరకు.. రంగారెడ్డి జిల్లా బడంగ్‌పేటకు చెందిన కింగ్లీకార్ ప్రవీణ్ కుమార్(40), అతడి స్నేహితుడు గోపికృష్ణ పెద్దాపూర్‌లో ఉన్న స్వామి గురూజీని కలవడానికి బైక్‌పై వస్తున్నారు. కల్వకుర్తి నుంచి హైదరాబాద్ వెళ్తున్న అచ్చంపేట డిపోకు చెందిన బస్సు పెద్దాపూర్ స్టేజీ వద్ద నిలిచిన బస్సును దాటే క్రమంలో ఎదురుగా వస్తున్న బైక్‌ను ఢీకొంది. ఈ ప్రమాదంలో ప్రవీణ్‌కుమార్, గోపికృష్ణకు గాయాలు కాగా వెంటనే చికిత్స నిమిత్తం 108 వాహనంలో మండల కేంద్రంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ప్రవీణ్‌కుమార్ మృతిచెందాడు. భార్య అక్షర ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కల్వకుర్తి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించినట్లు ఎస్‌ఐ వివరించారు. గోపీకృష్ణ మిఠాయి దుకాణంలో పనిచేస్తుండగా.. ప్రవీణ్‌కుమార్ బడంగ్‌పేటలో మటన్ వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగించేవాడు.
మహిళ బలవన్మరణం
రాజోళి: కుటుంబ సమస్యలతో ఓ మహిళ పురుగుమందు తాగి ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్‌ఐ జగదీశ్ తెలిపారు. ఆయన కథనం మేరకు.. మండల కేంద్రానికి చెందిన కటిక లలితాబాయి (58)కి ఇద్దరు కుమా ర్తెలు, ముగ్గురు కుమారులు ఉన్నారు. భర్త చంద్రారావు మానసికంగా సక్రమంగా లేకపోవడం, కుమారులకు వివాహాలు కాక పోవడం, వ్యాపారాలు సాగకపోవడంతో మనోవేదనకు గురై సోమవారం రాత్రి పురుగుమందు తాగింది. గుర్తించిన కుటుంబసభ్యులు వెంటనే కర్నూలు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. పెద్ద కుమారుడు కిషోర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసు కొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ వివరించారు.
చికిత్స పొందుతూ
వ్యక్తి మృతి
మదనాపురం: తల్లి గొడ్డలితో దాడి చేయగా గాయపడ్డ కొడుకు చికిత్స పొందుతూ కోలుకోలేక మృతి చెందినట్లు సీఐ శివకుమార్ తెలిపారు. వివరాలు.. మండలంలోని అజ్జకొల్లు గ్రామానికి చెందిన కోటకొండ బాలకృష్ణ (35) పంచాయతీలో పారిశుద్ధ్య కార్మికుడిగా పనిచేస్తున్నాడు. ఆరోగ్యం బాగా లేకపోవడంతో ఏడాదిగా బాలకృష్ణ బదులు తల్లి లక్ష్మి పనిచేస్తుంది. ఈ నెల జీతం కుమారుడు ఖాతాలో పడింది. 3వ తేదీన డబ్బులు ఇవ్వమని లక్ష్మి కొడుకును కోరింది. దీంతో తల్లీకొడుకుల మధ్య గొడవ జరిగింది. లక్ష్మి గొడ్డలితో కొడుకుపై దాడి చేసింది. చిన్నకుమారుడు రవి హుటాహుటిన బాలకృష్ణను వనపర్తి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మెరుగైన వైద్య కోసం గాంధీ ఆస్పత్రిలో చేర్పించగా చికిత్స పొందుతూ మంగళవారం మృతిచెందాడు. రవి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు.
ఖిల్లాఘనపురంలో
బాలిక..
ఖిల్లాఘనపురం: మండల కేంద్రానికి చెందిన సుష్మ(10) చికిత్స పొందుతూ సోమవారం రాత్రి మృతి చెందినట్లు ఎస్‌ఐ సురేశ్‌గౌడ్ తెలిపారు. ఆయన కథనం మేరకు.. గ్రామానికి చెందిన అక్కి శ్రీశైలంకు సుష్మ (10), నిశిత కుమార్తెలు. వీరిద్దరు ఈ నెల 6న గొర్రెలు మేపుతుండగా.. సుష్మ అకస్మాత్తుగా కూలిపడి నోటిలో నుంచి నురగ వచ్చింది. గుర్తించిన నిశిత వెంటనే తండ్రికి సమాచారం ఇచ్చింది. ఆయన వెంటనే మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రికి అటు నుంచి మహబూబ్‌నగర్, హైదరాబాద్‌లోని నిలోఫర్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ సోమవారం రాత్రి మృతిచెందింది. విష పురుగు కరిచి తమ కుమార్తె మృతి చెందిందని తండ్రి ఫిర్యాదు మేరకు కేసునమోదు చేసుకొని దర్యాప్తు చేపడుతున్నట్లు ఎస్‌ఐ వివరించారు.
గుర్తుతెలియని జంతువు దాడిలో ఆవు మృతి
ధరూరు : మండలంలోని మార్లబీడుకి చెందిన రైతు బాయిదొడ్డి రాజుకు చెందిన ఆవుపై ఓ గుర్తు తెలియని జంతువు దాడి చేయగా మృతిచెందింది. బాధితుడు తెలిపిన వివరాలు.. మార్లబీడుకి చెందిన రైతు బాయిదొడ్డి రాజు పొలం ధరూరు గట్టు శివారులో ఉంటుంది. పశువులను అక్కడే కట్టేసిన రైతు మంగళవారం ఉదయం పొలం వద్దకు వెళ్లి చూడగా.. ఆవు గొంతు భాగం రక్తగాయాలతో కనిపించింది. దీంతో రైతు అటవీ శాఖాధికారులకు సమాచారం అందించగా వారు రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కొనఊపిరితో ఉన్న ఆవు మధ్యాహ్నం మృతిచెందింది. బాధిత రైతును ప్రభుత్వం ఆర్థికంగా ఆదుకోవాలని రైతులు రాఘవేంద్ర, మార్లబీడు గ్రామస్తులు కోరారు.

బస్సు, బైక్ ఢీ : ఒకరి దుర్మరణం