
విస్తృతం ప్రచారం చేయాలి
బాలల హక్కుల రక్షణ కోసం
మహబూబ్‌నగర్ రూరల్: బాలల రక్షణ కోసం చట్టం నిర్దేశించిన హక్కులను పరిరక్షించేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని స్టేట్ చైల్డ్ రైట్స్ కమిషన్ సభ్యులు వందనగౌడ్, వచన్‌కుమార్, మరిపల్లి చందన, ప్రేమ్‌లత అగర్వాల్ అన్నారు. బుధవారం జిల్లాకేంద్రంలో మహిళా, శిశు సంక్షేమశాఖ ఆధ్వర్యంలో కొనసాగుతున్న శిశుగృహ, స్టేట్ హోమ్, జువైనెల్ జస్టిస్ బోర్డులను సందర్శించారు. ముందుగా శిశుగృహను సందర్శించిన కమిషన్ సభ్యులు పిల్లల గురించి, అక్కడ ఉన్న పరిస్థితుల గురించి అడిగి తెలుసుకున్నారు. ప్రత్యేక అవసరాలు పిల్లల గురించి శిశు గృహ సిబ్బందికి సూచనలు, సలహాలు ఇచ్చారు. ఈ సందర్భంగా కమిషన్ సభ్యులు మాట్లాడుతూ శిశుగృహలో ఉన్న చిన్నారుల ఆరోగ్యం పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలని సూచించారు. చిన్నారులకు బలవర్ధకమైన ఆహారం అందించాలని చెప్పారు. స్టేట్‌హోంలో ఉన్న యువతులకు స్వయం ఉపాధి శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. అనంతరం డీడబ్ల్యూఓ జరీనాబేగంతో కలిసి జిల్లాలోని పిల్లల వివరాలపై సమీక్షించారు. బాల్య వివాహాలు జరగకుండా కఠినచర్యలు తీసుకోవాలని కమిషన్ సభ్యులు సూచించారు. బాల్య వివాహాల వివరాలపై ఎప్పటికప్పుడు కమిషన్‌కు నివేదించాలని ఆదేశించారు. బాల కార్మిక వ్యవస్థ లేకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. జిల్లాలో పిల్లల కోసం పని చేస్తున్న ఎన్జీఓలను సమన్వయం చేసుకొని చిన్నారులకు అన్ని విధాలుగా న్యాయం చేయాలని తెలిపారు. పిల్లల సంరక్షణ కేంద్రాలలో ఉన్న చిన్నారులకు అన్ని వసతులు కల్పించాలని అన్నారు. పిల్లల హక్కుల రక్షణ కోసం స్టేట్ కమిషన్ ఉందనే విషయాన్ని విస్తృతంగా ప్రచారం చేయాలని అన్నారు. కార్యక్రమంలో సీడబ్ల్యూసీ చైర్మన్ నయిమొద్దీన్, సభ్యులు మాణిక్యప్ప, విజయకుమార్, జేజేబీ సభ్యులు గేస్ సీడీపీఓ శైలాశ్రీ, ఏసీడీపీఓ వెంకటమ్మ, డీసీపీఓ నర్మద, శిశుగృహ మేనేజర్ గణేష్‌బాబు, సూపర్‌వైజర్ ప్రసన్న తదితరులు పాల్గొన్నారు.