
గోడ కూలి వలస కూలీ మృతి
కొత్తపల్లి: బతుకుదెరువు కోసం హైదరాబాద్‌లో భవన నిర్మాణ కూలీగా పనిచేస్తున్న కొత్తపల్లి మండలంలోని భూనీడు గ్రామానికి చెందిన శివనోళ్ల రాంరెడ్డి (50) మృతి చెందిన ఘటన ఆదివారం రాత్రి చోటుచేసుకుంది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. భూనీడు గ్రామానికి చెందిన శివనోళ్ల రాంరెడ్డి ఆయన భార్య అనురాధతో కలిసి ఐదేళ్లుగా హైదరాబాద్‌లోని బుద్వేల్‌లో అద్దె ఇంట్లో ఉంటూ రోజువారీ కూలీగా జీవనం కొనసాగిస్తున్నాడు. ఆదివారం భవన నిర్మాణ పనులు చేస్తుండగా.. మధ్యాహ్నం ఒంటి గంట ప్రాంతంలో ఒక్కసారిగా గోడ కూలి పనిచేస్తున్న ఐదుగురు కూలీలపై పడింది. ఈ ఘటనలో గాయపడ్డ కూలీలను ఆస్పత్రికి తరలించారు. తీవ్రంగా గాయపడిన భూనీడు గ్రామానికి చెందని రాంరెడ్డి చికిత్స పొందుతూ ఆదివారం రాత్రి మరణించాడు. అక్కడే పనిచేస్తున్న మృతుడి భార్య అనురాధకు కాలు విరిగినట్లు గ్రామస్తులు తెలిపారు. సోమవారం పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని గ్రామానికి తీసుకొచ్చారు. మృతుడికి 12 ఏళ్ల కుమారుడు ఉన్నాడు.
భార్యకు తీవ్ర గాయాలు