
భూ భారతితో సమస్యలు పరిష్కారం
రాజాపూర్: భూ భారతి చట్టంతో సమస్యలన్నీ పరిష్కారమవుతాయని కలెక్టర్ విజయేందిర అన్నారు. సోమవారం రాజాపూర్, బాలానగర్‌లో నిర్వహించిన భూ భారతి అవగాహన సదస్సుల్లో ఆమె పాల్గొని మాట్లాడారు. భూ భారతితో ఇకపై రైతులు భూ సమస్యలతో ఇబ్బందులు పడకుండా ఉంటారన్నారు. భూ సమస్యలు ఏమి ఉన్నా తహసీల్దార్ కార్యాలయంలో విన్నవించుకోవాలని సూచించారు. ధరణిలో ఉన్న లోపాలను సవరించి సమగ్ర వివరాలతో భూ భారతి చట్టం తీసుకురావడం జరిగిందన్నారు. ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి మాట్లాడుతూ ధరణి వల్ల అనేక రైతు కుటుంబాలు రోడ్డున పడ్డాయని ఆరోపించారు. పట్టా భూములు నిషేధిత జాబితాలోకి వెళ్లాయని, దాని నుంచి తీయడానికి పైరవీలు చేయాల్సి వచ్చేదన్నారు. పేదవారు సమస్యలు పరిష్కారం కాక ప్రభుత్వ కార్యాలయాలు, నాయకుల చుట్టూ తిరిగి వేసారి పోయారన్నారు. ధరణి ద్వారా ఎదుర్కొన్న సమస్యలను ఆ చట్టంలోని లోపాలు సవరించి రైతులు బాధలు తీర్చేలా భూ భారతి చట్టం వచ్చిందన్నారు. ప్రతి ఒక్క రైతు భూ భారతిపై అవగాహన పెంచుకోవాలని సూచించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ మోహన్‌రావు, తహసీల్దార్లు శ్రీనివాస్‌రెడ్డి, విద్యాసాగర్‌రెడ్డి, మార్కెట్ చైర్‌పర్సన్ అశ్వినిరెడ్డి, వైస్ చైర్మన్ శేఖర్‌గౌడ్, డీసీఎంఎస్ చైర్మన్ ప్రభాకర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.