కెరమెరి(ఆసిఫాబాద్): లే.. బిడ్డా.. మమ్మల్ని ఇంత తొందరగా వదిలి వెళ్లావా..నాయనా! మేమేం పాపంచశామని ఆ దేవుడు ఇంత అన్యా యం చేసిండు.. ఇక ఎవరిని కొడుకా! అని పిలవాలి నాన్నా.. అంటూ ఆ తల్లిదండ్రుల రోదనలు అక్కడివారిని కంటతడిపెట్టించాయి. మరో ఐదు నిమిషాల్లో ఇంటికి చేరుతాడనుకుంటే.. కారు రూపంలో మృత్యువు వెంటాడింది.. ఆసిఫాబాద్ మండల కేంద్రంలో కెస్లాపూర్‌లోని హనుమాన్ విగ్రహం సమీపంలో శుక్రవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో గేడాం వేణు(27) తీవ్రంగా గాయపడగా చంద్రాపూర్ ఆస్పత్రికి తరలిస్తున్న క్రమంలో పది నిమిషాలు ఆలస్యం కావడంతో మృతిచెందాడు.
కుటుంబీకుల వివరాల ప్రకారం...
ఆసిఫాబాద్‌లోని ఎస్‌జీవో కాలనీలో నివాసముంటున్న గేడాం నాగేశ్వర్, నిర్మల దంపతులకు ఒక కొడుకు.. ఇద్దరు కూతుర్లు. కుమారుడు వేణుగోపాల్ కెరమెరి మండలంలోని రకంజివాడ గ్రామ పంచాయతీలో కార్యదర్శిగా విధులు నిర్వహిస్తున్నాడు. శుక్రవారం బైక్ సర్విసింగ్ కోసం మేణుగోపాల్‌తో పాటు అనార్‌పల్లి గ్రామ కార్యదర్శి ప్రశాంత్ మంచిర్యాలకు వెళ్లి తిరుగు ప్రయాణమయ్యారు. ఆసిఫాబాద్‌లోని కెస్లాపూర్ హనుమాన్ విగ్రహం సమీపంలోకి రాగానే వీరి బైక్‌ను కారు ఢీకొంది. ఈ ప్రమాదంలో వేణుగోపాల్, ప్రశాంత్‌కు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు ఆసిఫాబాద్‌లోని ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించారు. మెరుగైన వైద్యం కోసం ప్రశాంత్‌ను మంచిర్యాలకు తరలించగా, వేణుగోపాల్‌ను చంద్రాపూర్ ఆస్పత్రికి తరలించారు.
పది నిమిషాల ఆలస్యంతో...
వేణుగోపాల్‌ను చంద్రాపూర్ ఆస్పత్రికి ప్రైవేటు అంబులెన్స్‌లో తరలిస్తుండగా రాజురా వద్ద టైర్ పంక్చర్ అయింది. దీంతో సుమారు 20నిమిషాల సమయం వృథా అయింది. ఆస్పత్రికి చేరుకుని అంబులెన్స్ నుంచి స్ట్రేచర్‌పై పడుకొపెట్టే సరికి ప్రాణాలు వదిలాడు.. పరీక్షించిన వైద్యులు పది నిమిషాల ముందు తీసుకువస్తే బతికేవాడని తెలిపారు. కాగా అంబులెన్స్‌లో ఆక్సిజన్ ఉన్నా పెట్టకపోవడంతో శ్వాస ఆడలేదని, టైరు పంక్చర్ కావడంతో సమయానికి ఆస్పత్రికి చేరలేక నిండు ప్రాణం గాల్లో కలిసిపోయింది.
పలువురి పరామర్శ
మరణవార్త తెలియగానే కెరమెరి ఎంపీపీ పెందోర్ మోతిరాం, జెడ్పీటీసీ సెడ్మకి దుర్పతబాయి, ఎంపీడీవో సత్యనారాయణగౌడ్, ఎంపీవో సుదర్శన్, ఈజీఎస్ ఏపీవో మల్లయ్య, ఎంపీడీవో సిబ్బంది సుధాకర్, నాయకులు రూప్‌లాల్, శేశారావు, గ్రామ కార్యదర్శులు పార్థివ దేహానికి పుష్పగుచ్ఛం సమర్పించి ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు.
Comments
Please login to add a commentAdd a comment