అక్రమ నిర్మాణాలను కూల్చుతున్న జేసీబీ
శ్రీరాంపూర్(మంచిర్యాల): శ్రీరాంపూర్ బస్టాండ్ ఏరియాలోని ఎన్‌హెచ్ 63 పరిధిలో ఉన్న అక్రమ నిర్మాణాలను సోమవారం మున్సిపల్ అధికారులు కూల్చివేయించారు. ఎన్‌హెచ్ అఽధికారుల ఆదేశాలతో నస్పూర్ మున్సిపల్ కమిషనర్ టీ.రమేశ్, సిబ్బందితో కలిసి జేసీబీలతో నిర్మాణాలను నేలమట్టం చేయించారు. మంచిర్యాల నుంచి శ్రీరాంపూర్ జీఎం కార్యాలయం వరకు రోడ్డు విస్తరణ పనులు జరుగుతున్నాయి. రోడ్డు విస్తరణ పనులు ఆర్నెళ్లుగా నడుస్తుండటంతో ఇప్పటికే కొందరు రోడ్డుకు దగ్గరగా ఉన్న నిర్మాణాలను కూల్చివేసి వెనక్కి కట్టుకున్నారు. కొంతమంది నిర్ణీత దూరం జరగకుండానే కొత్త నిర్మాణాలు చేపట్టారు.
వీటిని తొలగించాలని మూడు రోజుల నుంచి మున్సిపల్, ఎన్‌హెచ్ అధికారులు నోటీసులు జారీ చేశారు. అయినా ఎవరూ పట్టించుకోకపోవడంతో పోలీసు బందోబస్తు నడుమ జేసీబీలతో కూల్చివేశారు. రోడ్డు మధ్యభాగం నుంచి 66 ఫీట్ల వరకు రోడ్డు మార్కింగ్ చేసి ఆ పరిధిలో ఉన్న నిర్మాణాలను కూల్చివేశారు.
వర్తకుల అభ్యంతరం..
గతంలో రోడ్డు మధ్యలో నుంచి 60 ఫీట్లు మార్కింగ్ చేశారని, ఇప్పుడు 66 ఫీట్లు జరగాలని చెప్పి కొత్తగా కట్టుకున్నవి కూడా కూల్చివేస్తున్నారని కొందరు వర్తకులు అభ్యంతరం తెలిపారు. దీంతో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు పెద్దఎత్తున బందోబస్తు నిర్వహించారు.
Comments
Please login to add a commentAdd a comment