మంచిర్యాలఅర్బన్: ఈనెల 12 నుంచి పాఠశాలలు, కళాశాలలు ప్రారంభమయ్యాయి. దూరప్రాంతాల నుంచి కళాశాలలు, పాఠశాలల విద్యార్థుల రాకపోకలకు ఇబ్బందులు తప్పటం లేదు. పాస్‌లు పొందితే బస్సులు ప్రారంభించేందుకు ఆర్టీసీ సన్నద్ధమైంది. విద్యాసంస్థల్లో చదివే విద్యార్థులు నిత్యం వచ్చివెళ్లేందుకు బస్‌పాస్‌లు అవసరంతో ఉచిత రాయితీ పాస్‌లు అందించేందుకు ఆర్టీసీ అన్ని ఏర్పాట్లుచేసింది.
ఉచిత పాసులు ఇలా..
గ్రామీణ ప్రాంతాలకు రాకపోకలు సాగించే పల్లె వెలుగు బస్సుల్లో 12 ఏళ్ల లోపు(బాలురు) విద్యార్థులంతా 20 కి.మీ దూరం వరకు పాఠశాలకు వెళ్లిరావడానికి రోజు ఉచితంగా ప్రయాణించే సౌకర్యం కల్పిస్తున్నారు. పదో తరగతి వరకు చదువుకునే బాలికల కోసం ప్రయాణానికి అనుమతిస్తున్నారు. ఆర్టీసీ పాస్‌కోసం ఇంట్లో నుంచి పొందే అవకాశం అందుబాటులోకి వచ్చింది.
పైసా ఖర్చులేకుండా వెబ్‌సైట్‌లో అడిగిన వివరాలు పొందుపర్చి ఫొటో అప్‌లోడ్ చేసి దరఖాస్తు చేసుకోవచ్చు. www.online.tsrtcpass. in వెబ్‌సైట్‌లో రిజిష్టర్ అయితే నమోదు సంఖ్య వస్తుంది. దాన్ని పాస్ కౌంటర్‌లోని సిబ్బందికి తెలియజేస్తే బస్‌పాస్ పొందవచ్చు. తప్పనిసరిగా ఆయా విద్యాసంస్థలు అంగీకరిస్తేనే పాస్ జారీ అవుతుంది. నిర్వహణ ఖర్చుల నిమిత్తం ఏడాదికి రూ.50 చెల్లిస్తే బస్‌పాస్ అందిస్తారు.
35 కి.మీ లోపు రాయితీ పాసులు
మంత్లీ స్టూడెంట్ బస్‌పాస్ రాయితీ కూడిన విద్యార్థులు చార్జీలు కేటాయించారు. ప్రైవేట్ పాఠశాలల్లోని 12 ఏళ్లు పైబడిన బాలురతోపాటు కళాశాలల విద్యార్థులు ఆర్టీసీ రాయితీ పాస్‌లు పొందవచ్చు. 35 కి.మీ మాత్రమే ప్రయాణించేందుకు అవకాశం ఉన్నా బస్‌పాస్‌లకు కి.మీ చొప్పున చార్జీలు వసూలు చేస్తారు. గుర్తింపుకార్డు కోసం అదనంగా రూ.50 చెల్లించాల్సి ఉంటుంది. 12 ఏళ్లలోపు బాలురు ఉచిత బస్‌పాస్ ధర రూ.30, 18 ఏళ్లలోపు బాలికలకు ధర రూ.50 చెల్లించాల్సి ఉంటుంది. పాస్ ఏడాదిపాటు చెల్లుబాటు అవుతుంది.
విద్యార్థులకు ప్రయోజనం..
ఆర్టీసీ బస్సులో ప్రయాణం సురక్షితం. అంతకుమించి ప్రయాణ సౌకర్యం విద్యార్థులకు ఎంతో ప్రయోజనం. ప్రైవేట్ విద్యాసంస్థలు ఆర్టీసీ పేరిట డీడీలు చెల్లించాలి. విద్యార్థులకు బస్‌పాసులు అందించేందుకు చర్యలు తీసుకోవాలి. విద్యార్థుల సౌకర్యార్థం బస్‌స్టేషన్‌లో బస్‌పాసు కౌంటర్ ఏర్పాటు చేశాం. వివరాలకు 9985445438లో సంప్రదించవచ్చు.
– రవీంద్రనాథ్, ఆర్టీసీ డీఎం, మంచిర్యాల
ఎంతో ప్రయోజనం..
తమ విద్యార్థులకు బస్‌పాసులు మంజూరు చేయాలంటే ప్రైవేట్ విద్యాసంస్థలు ఆర్టీసీ పేరిట డీడీలు రూపంలో నగదు చెల్లించాల్సి ఉంది. ఆర్టీసీ ప్రత్యేకంగా యూజర్ నేమ్ పాస్‌వర్డ్ కేటాయిస్తుంది. తమ పాఠశాలల్లోని 12 ఏళ్లలోపు బాలురు, పదోతరగతి వరకు బాలికలు ఉచిత పాసులు పొందాలన్నా ప్రైవేట్ విద్యాసంస్థలు ఆర్టీసీకి నగదు చెల్లించాల్సి ఉంటుంది. అకౌంట్స్ ఆఫీసర్ టీఎస్‌ఆర్టీసీ ఆదిలాబాద్ పేరిట డీడీలను తీసి సమీపంలోని డిపోల్లో అందజేయాల్సి ఉంటుంది.
200 మంది లోపు విద్యార్థులున్నా పాత, కొత్త ప్రైవేట్ పాఠశాలలు రూ.700, 500లోపు విద్యార్థులు ఉన్న పాఠశాలలు రూ.1000, 500 మంది పైన విద్యార్థులున్నా పాఠశాలలు ఆడ్మిస్టేటివ్ చార్జీలు (రెన్యూవల్) రూ.1500, ఆడ్మిస్టేటివ్ చార్జీలు (ఫ్రెష్) కింద రూ.2వేలు చెల్లించాలి. డిగ్రీ, పీజీ కళాశాలల యాజమాన్యాలు రూ.6వేలు (కొత్తవి), రెన్యూవల్ కోసం రూ.5వేలు చెల్లించాలి. జూనియర్, డిప్లొమా, ఒకేషనల్ యాజమాన్యాలు ఆడ్మిస్టేటివ్ చార్జీలు కింద రూ.5వేలు, రెన్యూవల్ కోసం రూ.4 వేలు చెల్లించాలి.
ప్రైవేట్ విద్యాసంస్థలు డీడీలు చెల్లించాలి
విద్యార్థులకు ఉచిత పాస్‌లే కాకుండా రూట్‌పాస్ లు కూడా జారీ చేస్తారు. బస్‌పాసులు పొందడానికి విద్యాసంస్థలు ఆడ్మినిస్ట్రేటివ్ రుసుము చెల్లించాలి. ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలకు దీని నుంచి మినహాయింపు ఉండగా ప్రైవేట్ సంస్థలు విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా రుసుము చెల్లించాల్సి ఉంటుంది. విద్యాసంస్థను బట్టి వార్షిక రుసుము నిర్దేశించారు. రుసుము చెల్లించి అనుమతి పొందిన వారికే ఆర్టీసీ ఆన్‌లైన్‌లో చోటు లభిస్తోంది. దీని ఆధారంగా విద్యార్థులకు రాయితీ బస్‌పాస్‌ల జారీ కొనసాగనుంది. 3 నెలలు, 6 నెలలు ఇలా కాలపరిమితి కూడిన బస్‌పాస్‌లు కిలోమీటర్ బట్టి రాయితీతో పొందవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment