సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో టికెట్ల కేటాయింపు అధికార పార్టీ ఎమ్మెల్యేల్లో గుబులు రేపుతోంది. ఎన్నికలు సమీపిస్తున్న వేళ మళ్లీ టికెట్ వస్తుందా? రాదా? అనే మీమాంసలో ఉన్నారు. తమకే టికెట్లు మళ్లీ వచ్చేలా ప్రజల్లో గ్రాఫ్ పెంచుకునే పనిలో ఉన్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యేలకే మళ్లీ బీ ఫాం ఇస్తారా? లేక కొత్త వారిని ఎంపిక చేస్తారా? అనే చర్చ జిల్లా రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతోంది. జిల్లాలో నాలుగు నియోజకవర్గాలైన మంచిర్యాల, బెల్లంపల్లి, చెన్నూరు, ఖానాపూర్(జన్నారం) పరిధిలోని ఎమ్మెల్యేలు బీఆర్‌ఎస్ పార్టీకి చెందిన వారే. ఇందులో ముగ్గురు ఎమ్మెల్యేలు రెండేసి, మూడేసి సార్లు గెలుపొందిన వారే. చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్ మాత్రమే తొలిసారిగా ఎమ్మెల్యేగా గెలిచారు. అంతకుముందు పెద్దపల్లి ఎంపీగా ఉన్నారు. ఈ క్రమంలో మళ్లీ ఈ నలుగురికే టికెట్లు ఇస్తారా? లేదా? అని ప్రతిపక్ష నాయకుల్లో చర్చ సాగుతోంది.
వివాదాల్లో చిన్నయ్య..
బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య వ్యక్తిగతంగా పలు వివాదాల్లో చిక్కుకున్నారు. ఎన్నికలకు ముందే ‘ఆరిజిన్ డెయిరీ’ వివాదం ఆయనను వెంటాడుతోంది. నియోజకవర్గంలో తన అనుచరుల భూ కబ్జాలు, సెటిల్‌మెంట్లు, అభివృద్ధి పనుల్లో కమీషన్ల ఆరోపణలు వచ్చాయి. బెల్లంపల్లిలో జరిగిన ప్రగతి నివేదన సభలో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ చిన్నయ్యపై ప్రశంసలు కురిపించారు. నియోజకవర్గంలో అనేక అభివృద్ధి పనులు చేస్తున్నారని కొనియాడారు. మళ్లీ గెలుపించుకోవాలని ఇక్కడి ప్రజలను కోరారు. ఈ మాటలతో మళ్లీ తనకే టికెట్ అని ఎమ్మెల్యే అనుచరులు నమ్ముతున్నారు. ఇక్కడ మార్పు ఉంటుందని, అనేక ఆరోపణల నేపథ్యంలో కొత్త వారికి అవకాశం ఉంటుందనే వాదనలు ఉన్నాయి.
సుమన్‌కు కేసీఆర్ అండ
చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్‌కు సీఎం కేసీఆర్‌తో ఉన్న సాన్నిహిత్యంతో మళ్లీ టికెట్ ఖాయమని అనుచరులు చెప్పుకుంటున్నారు. రూ.వందల కోట్ల నిధుల తెచ్చి చెన్నూరును తన అడ్డాగా మార్చుకుంటున్నారని, ఇక్కడి నుంచే పోటీ చేస్తారని, సీటు ఖాయమని అంటున్నారు. 2018ఎన్నికల్లో సిట్టింగ్ ఎమ్మెల్యే నల్లాల ఓదేలును కాదని ఎంపీగా ఉన్న సుమన్‌కు టికెట్ ఇచ్చారు. జిల్లాలో చెన్నూరు ఒక చోట మాత్రమే సిట్టింగ్ ఎమ్మెల్యేను మార్చారు. కింది స్థాయి నాయకుల్లో సుమన్‌పై వ్యక్తమవుతున్న అసంతృప్తి, టికెట్ కేటాయింపులో ప్రభావం చూపనుందా? అనేది తేలాల్సి ఉంది. ఇక ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖానాయక్‌పై వ్యతిరేకత ఉండడంతో ఇక్కడ మార్పు ఉంటుందని బీఆర్‌ఎస్‌లోని ఓ వర్గం నాయకులే ప్రచారం చేస్తున్నారు. తమకే మళ్లీ అవకాశం వస్తుందని ఎమ్మెల్యే గట్టి నమ్మకంతో ఉన్నారు.
జిల్లాలో ఒకరిద్దరి మార్పు?
జిల్లాలో నలుగురు ఎమ్మెల్యేలపై ప్రజ ల్లో మద్దతు, వ్యతిరేకత, అవినీతి, అక్రమాల ఆరో పణలు, వ్యక్తిగత విమర్శలు టికెట్ల కేటాయింపులో ఎంతమేరకు ప్రభావం చూపుతాయన్నది కీలకంగా మారింది. మంచిర్యాల ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్‌రావు జిల్లాలో సీనియర్ నాయకులుగా ఉన్నారు. బీఆర్‌ఎస్ నుంచి వరసగా రెండుసార్లు, అంతకుముందు కాంగ్రెస్ నుంచి గెలిచిన చరిత్ర ఉంది. ఆయనతోపాటు కొడుకు విజిత్‌రావు సైతం రాజకీయాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. కింది స్థాయి నాయకులు కొందరు విజిత్‌రావును ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రచారం చేస్తున్నారు. విజిత్‌రావు గ్రామాల్లో పర్యటిస్తూ, పార్టీ కార్యకలాపాల్లో పాల్గొంటున్నారు.
ఇటీవల జరిగిన సీఎం సభలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఎమ్మెల్యే దివాకర్‌రావు గురించి ఎటువంటి ప్రస్తావన తీసుకు రాలేదు. సభ వేదికపై శాలువా కప్పేందుకు ప్రయత్నించగా వద్దని వారించారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ప్రత్యర్థులు పలు రకాలుగా ఈ వీడియోను ప్రచారం చేశారు. తాజా పరిస్థితుల్లో తండ్రి, కొడుకుల్లో ఎవరికి టికెట్? లేక మార్పు ఉంటుందా? అనే ప్రశ్నలు వస్తున్నాయి.
ఎమ్మెల్యేలపై నివేదికలు
ఎమ్మెల్యేలకు ప్రజల్లో బలం, ఆర్థిక స్థితిగతులు, వీరిని కాదని కొత్త వారికి అవకాశం ఇస్తే ఎలా ఉంటుందనే కోణాల్లో సర్వేలు జరిగాయి. అదే సమయంలో మార్చే చోట పార్టీలో గెలిచే సత్తా ఉన్న నాయకులు ఉన్నారా? అని ఆరా తీసినట్లు సమాచారం. టికెట్లు ఇవ్వకపోతే ఎమ్మెల్యేలను ఎలా సంతృప్తి పరచాలి? ఎవరైనా పార్టీ మారేందుకు ప్రతిపక్షాలతో టచ్‌లో ఉంటున్నారా? అనే కోణాల్లో ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే నియోజకవర్గాల వారీగా సిట్టింగ్ ఎమ్మెల్యేతోపాటు ఇంకో ముగ్గురు నాయకుల పేర్లతో సర్వేలు చేయించారు. ఇందులో ఇద్దరి పేర్లు మాత్రమే పాజిటివ్‌గా ఉన్నట్లు సమాచారం. ఎన్నికల షెడ్యూల్‌కు ముందే మరోసారి నివేదికలు తెప్పించుకుని ఆయా నియోజకవర్గాల్లో ప్రతిపక్ష అభ్యర్థుల బలం, సిట్టింగ్ ఎమ్మెల్యే గ్రాఫ్‌ను బట్టి టికెట్లు ఖరారు చేస్తారని సమాచారం. అప్పటి వరకు సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టికెట్ టెన్షన్ మాత్రం తప్పేలా లేదు.
Comments
Please login to add a commentAdd a comment