మంచిర్యాల: రోడ్డు సదుపాయానికి నోచుకోని గిరిజన గ్రామం అది. అత్యవసర సమయంలో ఆస్పత్రికి వెళ్లాలంటే కాలినడకన లేదా ఎడ్లబండే గతి. ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని వాగులు, వంకలు దాటాల్సిందే. 108 అంబులెన్స్ రాక, వైద్య సౌకర్యం అందక ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు.
నెన్నెల మండలం కోనంపేట పంచాయతీ పరిధిలోని పాటి గ్రామానికి చెందిన గిరిజన మహిళ రెడ్డి మల్లక్క మూడు నెలల గర్భిణి. మూడు రోజులుగా జ్వరంతో బాధపడుతోంది. ఇటీవల కురుస్తున్న వర్షాలకు ఎర్రవాగు ఉప్పొంగి ప్రవహిస్తుండడంతో దారిలేక ఆస్పత్రికి వెళ్లలేకపోయింది. బుధవారం తీవ్ర రక్తస్రావం కావడంతో వెంటనే కుటుంబ సభ్యులు ఎడ్లబండిపై లంబాడితండా ఎర్రవాగు వరకు తీసుకువచ్చారు.
అక్కడ ఆటోలో ఎక్కించి అందరూ కలిసి అతికష్టం మీద వాగు దాటించి బెల్లంపల్లిలోని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. గతంలో దమ్మిరెడ్డిపేటకు చెందిన గిరిజనుడు జ్వరంతో బాధపడుతూ వాగు దాటలేక మృతి చెందాడు. ఎన్నికల ముందు సర్పంచ్ హామీ ఇచ్చినప్పటికీ రోడ్డు సౌకర్యం కల్పించలేదని గిరిజనులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వర్షం వస్తే పాటి గ్రామం జలదిగ్బంధంలో చిక్కుకొని గిరిజనులు బాహ్య ప్రపంచానికి దూరమవుతున్నారు.
ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా నేతలు మారినా అధికారులు వచ్చి చూసినా దారిచూపే నేతలు లేక మా రాతలు మారడం లేదని గిరిజనులు గోడు వెల్లబోసుకుంటున్నారు. ఇప్పటికై నా అధికారులు, నాయకులు స్పందించి గిరిజన గ్రామాలకు రోడ్డు సౌకర్యం కల్పించి ప్రాణభిక్ష పెట్టాలని వేడుకుంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment