
‘ఆయిల్‌పాం’పై అనాసక్తి
● అవగాహన కల్పిస్తున్న అధికారులు ● సాగుకు వెనుకడుగు వేస్తున్న రైతులు
బెల్లంపల్లి: జిల్లాలోని రైతులు ప్రధానంగా వరి, పత్తి పంటలు మినహా ఇతర పంటల సాగుపై ఆసక్తి చూపడం లేదు. ఆరుగాలం శ్రమించి పంటలు సాగు చేసినా లాభదాయకంగా లేకపోవడంతో ఆవేదనకు గురవుతున్నారు. రైతాంగాన్ని కష్టాల నుంచి గట్టెక్కించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఆయిల్‌పాం సాగును ప్రోత్సహిస్తున్నా సానుకూలత వ్యక్తం చేయడం లేదు. ఉద్యానవన శాఖ అధికారులు అవగాహన కల్పిస్తున్నా రైతుల ఆలోచనల్లో మార్పు రావడం లేదు. జిల్లాలో ఆయిల్‌పాం సాగు ప్రారంభించి నాలుగేళ్లు కావస్తున్నా అధిక శాతం మంది వెనుకడుగు వేస్తున్నారు. జిల్లాలో ఇప్పటివరకు 2,770ఎకరాల్లో ఆయిల్‌పాం సాగు చేసినట్లు ఉద్యానవన శాఖ గణంకాలు స్పష్టం చేస్తుండగా.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మరో 359మంది రైతులు సాగుకు ముందుకొచ్చారు. కానీ ఎంపిక చేసిన గ్రామాల్లో ఆసక్తి చూపడం లేదు. ఏటా సాగు లక్ష్యాన్ని పెంచాల్సి ఉండగా ప్రతికూల పరిస్థితులు ఎదురవుతున్నాయి.
మంచిర్యాలలో అత్యల్పం
జిల్లాలో 18మండలాలు ఉండగా.. 877 మంది రైతులు మాత్రమే 3,129 ఎకరాల్లో సాగు చేస్తున్నారు. మంచిర్యాల మండలంలో అత్యల్పంగా ఇద్దరు, నస్పూర్‌లో ముగ్గురు, జైపూర్‌లో 116మంది(403 ఎకరాలు), చెన్నూర్‌లో 95మంది(369 ఎకరాలు), మందమర్రిలో 74మంది(259 ఎకరాలు), భీమినిలో 43మంది(257 ఎకరాలు), కోటపల్లిలో 59మంది(244) ఎకరాల్లో సాగుకు ఆసక్తి చూపించారు. జైపూర్‌లో అత్యధికంగా ముందుకు రాగా.. మంచిర్యాలలో ఇద్దరే ఆసక్తి చూపడం గమనార్హం.
సబ్సిడీపై మొక్కలు
ఆయిల్‌పాం సాగు చేసే రైతులకు ప్రభుత్వం సబ్సిడీ వర్తింపజేస్తోంది. ఒక్కో మొక్క ఖరీదు గరిష్టంగా రూ.250 వరకు ఉండగా.. రూ.20కే అందజేస్తోంది. అదనంగా సబ్సిడీతో డ్రిప్ సౌకర్యం కల్పిస్తోంది. ఎస్సీ, ఎస్టీ రైతులకు 100శాతం, బీసీ సామాజిక రైతులకు 90శాతం, ఓసీలకు 80శాతం సబ్సిడీపై డ్రిప్ పరికరాలు అందజేస్తున్నా రైతుల్లో స్పందన రావడం లేదు.
అవగాహన కల్పిస్తున్నాం
ఆయిల్‌పాం సాగు చేస్తే నాలుగేళ్లకే పంట చేతికి అందివస్తుంది. దాదాపు 25 ఏళ్ల వరకు దిగుబడి వస్తుంది. వరి, పత్తి, ఇతర పంటలకన్నా ఆయిల్‌పాం సాగు లాభదాయకంగా ఉంటుంది. గెలలకు సరైన మద్దతు ధర కూడా ఉంటుంది. వరి, పత్తి పంటలకు ప్రత్యామ్నాయంగా ఆయిల్‌పాం సాగు చేయాలని రైతులకు అవగాహన కల్పిస్తున్నాం.
– కె.అనిత, జిల్లా ఉద్యానవన శాఖ అధికారి

‘ఆయిల్‌పాం’పై అనాసక్తి
Comments
Please login to add a commentAdd a comment