
నిషేధిత పత్తి విత్తనాల పట్టివేత
● 2 క్వింటాళ్ల 74 కిలోలు స్వాధీనం ● బెల్లంపల్లి ఏసీపీ రవికుమార్
భీమిని: మండలంలోని మల్లిడి ప్రధాన రహదారిపై సోమవారం భీమిని పోలీసులు నిషేధిత పత్తి విత్తనాలను పట్టుకున్నారు. రూ.6.85లక్షల విలువైన 2క్వింటాళ్ల 74కిలోలు విత్తనాలు స్వాధీనం చేసుకున్నారు. సోమవారం స్థానిక పోలీసుస్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఏసీపీ రవికుమార్ వివరాలు వెల్లడించారు. నకిలీ పత్తి విత్తనాలు తరలిస్తున్నారనే సమాచారం మేరకు మల్లిడి క్రాస్ రోడ్డు వద్ద పోలీసులు వాహనాల తనిఖీ చేపట్టారు. కుమురంభీం జిల్లా దహెగాం మండలం అత్తిని గ్రామం నుంచి భీమిని మండలం వడాల వైపు ద్విచక్ర వాహనంపై తరలిస్తుండగా పట్టుకున్నారు. వారిని విచారణ చేయగా.. వడాల గ్రామంలోని బంధువులకు అమ్మడానికి 50కిలోల గ్లైసిల్ విత్తనాలు తరలిస్తున్నట్లు పేర్కొన్నారు. అనంతరం వారు ఇచ్చిన సమాచారం మేరకు అత్తిని గ్రామంలోని రాజన్న ఇంట్లో 2క్వింటాళ్ల 27 కిలోల విత్తనాలు స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ రూ.6.85లక్షలు ఉంటుందని, కుమురంభీం జిల్లా చింతలమానెపల్లి మండలం గంగాపూర్ గ్రామానికి చెందిన పురుషోత్తం, పోశం, కృష్ణ, దహెగాం మండలం అత్తిని గ్రామానికి చెందిన రాజన్న, గుంటూరుకు చెందిన సురేష్‌లపై కేసు నమోదు చేశామని ఏసీపీ తెలిపారు. నిషేధిత గ్‌లైసిల్ విత్తనాలు అక్రమంగా చేరవేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పట్టుబడిన పత్తి విత్తనాలను మండల వ్యవసాయాధికారులు నిషేధిత పత్తి విత్తనాలుగా ధ్రువీకరించారు. భీమిని పోలీసులను ఏసీపీ అభినందించారు. తాండూర్ సీఐ కుమారస్వామి, భీమిని ఎస్సై విజయ్‌కుమార్, ఇన్‌చార్జి వ్యవసాయాఽధికారి వీరన్న పాల్గొన్నారు. కాగా, ఫిబ్రవరి 25న ‘నిషేధిత విత్తనంపై జాగ్రత్త’ శీర్షికన ‘సాక్షి’లో కథనం ప్రచురితమైంది. ముందే అధికారులను అప్రమత్తం చేసింది.
Comments
Please login to add a commentAdd a comment