
వన్యప్రాణుల దప్పిక తీరేదెలా..!
● అడవిలో తాగునీటి వనరుల కొరత ● మైదాన ప్రాంతాల్లో సంచారం ● వేటగాళ్ల ఉచ్చుకు బలవుతున్న జంతువులు
చెన్నూర్: జిల్లాలోని అటవీ ప్రాంతం వన్యప్రాణులకు పేరుగాంచింది. ఇటీవల కాలంలో అటవీ ప్రాంతంలో తాగునీటి వనరులు అంతరించిపోతున్నట్లు తెలుస్తోంది. ఇక వేసవి కాలం ఆరంభం కావడంతో దప్పిక తీరే దారి లేక అటవీ జంతువులు అల్లాడిపోయే ప్రమాదం నెలకొంది. ఇప్పటికే పలు సందర్భాల్లో వన్యప్రాణులు దాహార్తి తీర్చుకోవడానికి అడవి దాటి బహిరంగ ప్రదేశాలకు వస్తున్నాయి. చెన్నూర్ అటవీ డివిజన్‌లోని చెన్నూర్, కోటపల్లి, నీల్వాయి, జైపూర్ రేంజ్‌లలో చిన్న నీటికుంటలు, నీటికుంటలు, చెక్‌డ్యామ్‌లు, సోలార్ బోర్‌వెల్స్, సాసర్‌పిట్‌లు, చెలిమెలు ఉన్నట్లు అటవీ అధికారులు చెబుతున్నారు. కానీ అవి ఏ మేరకు వినియోగంలో ఉన్నాయనేది ప్రశ్నార్థకంగానే మారింది. మార్చి ఆరంభంలోనే ఎండలు మండిపోతుండడంతో వన్యప్రాణుల దప్పిక తీర్చేందుకు అటవీ అధికారులు చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది. గత నెల 22న వేమనపల్లి మండలం బెద్దంపల్లి గ్రామంలోకి జింక రావడంతో గ్రామస్తులు పట్టుకుని అటవీ అధికారులకు అప్పగించారు. జిల్లాలో వన్యప్రాణుల సంరక్షణకు అటవీ అధికారులు రకరకాల చర్యలు చేపడుతున్నా ఎక్కడో ఓ చోట వేటగాళ్ల ఉచ్చులో చిక్కుకుని బలైపోతున్నాయి. ఒకప్పుడు వన్యప్రాణులు మైదాన ప్రాంతంలో సంచరించిన జనం హాని తలపెట్టిన దాఖలాలు లేవు. గ్రామాల పొలిమేర వరకు అడవులు ఉండడంతో జింకలు, కుందేళ్లు, నక్కలు, అడవి పిల్లులు, నెమళ్లు, అడవి కోళ్లు సంచరించేవి. కానీ ఇటీవల కాలంలో అడవి జంతువులకు రక్షణ లేకుండా పోయింది. గత కొంతకాలంగా వేటగాళ్లు యథేచ్ఛగా వన్యప్రాణులను వేటాడుతున్నాడు. అటవీ ప్రాంతంలోనే నెమళ్లు, అడవి కోళ్లు అరుదుగా కనిపిస్తున్నాయని కోటపల్లి మండలం అన్నారం గ్రామానికి చెందిన మల్లయ్య అభిప్రాయపడ్డాడు. అటవీ జంతువుల వేట పెరిగిపోవడంతో ఒకప్పుడు కనిపించిన అటవీ జంతువులు నేడు కనిపించడం లేదని వేమనపల్లికి చెందిన కిష్టయ్య తెలిపాడు.
చిన్న నీటికుంటలు 122
నీటికుంటలు 629
చెక్‌డ్యామ్‌లు 17
సోలార్ బోర్‌వెల్స్ 12
సాసర్ పిట్‌లు 89
చెలిమెలు 30
చెన్నూర్ డివిజన్‌లో
తాగునీటి వనరులు ఇలా
తాగునీటి వసతి కల్పిస్తున్నాం..
వన్యప్రాణుల సంరక్షణలో భాగంగా తాగునీటి వసతి కల్పించాం. ఎండలను దృష్టిలో ఉంచుకొని అన్ని విధాలుగా చర్యలు చేపట్టి నిత్యం పర్యవేక్షిస్తున్నాం. సాసర్ పిట్‌లు ఏర్పాటు చేసి ట్యాంక్‌ల ద్వారా నీరు పోయిస్తున్నాం. నీటి లభ్యత లేని ప్రాంతంలో మోటార్లు ఏర్పాటు చేసి సోలార్ ద్వారా నీరందిస్తున్నాం. కొన్ని ప్రాంతాల్లో చెలిమెలు ఏర్పాటు చేశాం.
– శివకుమార్, ఎఫ్‌ఆర్వో, చెన్నూర్

వన్యప్రాణుల దప్పిక తీరేదెలా..!
Comments
Please login to add a commentAdd a comment