
కన్నాల అడవిలో పులి సంచారం
బెల్లంపల్లిరూరల్/కాసిపేట: బెల్లంపల్లి మండలం కన్నాల అటవీ ప్రాంతంలో శుక్రవారం పెద్దపులి సంచారం కలకలం రేపింది. అటవీ ప్రాంతానికి వెళ్లిన కొందరు స్థానికులు అటవీ అధికారులకు సమాచారం అందించారు. దీంతో బెల్లంపల్లి ఫారెస్ట్ రేంజ్ అధికారి పూర్ణచందర్, డిప్యూటీ రేంజ్ అధికారులు సతీష్, ప్రవీణ్‌నాయక్, సిబ్బంది అటవీ ప్రాంతంలో పర్యటించి పులి పాదముద్రలను గుర్తించారు. కన్నాల–పెద్దబుగ్గ ప్రాంతంలోని నీటి కుంట వద్ద పులి నీరు తాగుతుండగా ప్రత్యక్షంగా చూశారు. పులి తిరిగిన ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా తిర్యాణి అటవీ ప్రాంతం నుంచి పులి కన్నాల అటవీ ప్రాంతానికి వచ్చి ఉంటుందని, బీ–2 పులి కావొచ్చని భావిస్తున్నారు.
రెండ్రోజులుగా..
రెండ్రోజులుగా కాసిపేట మండలంలో పులి సంచరిస్తున్నట్లు తెలుస్తోంది. పెద్దనపల్లి శివారులోని గుట్ట ప్రాంతం పెద్దమ్మగుడి సమీపంలో పలువురికి కనిపించింది. గురువారం బుగ్గగూడెం, కర్షలగట్టం శివారులో పులి తిరుగుతున్నట్లు అటవీ అధికారులు నిర్ధారించారు. శుక్రవారం ఉదయం బుగ్గ శివారులో పర్యటించగా నీళ్లు తాగుతూ కనిపించింది. గుట్టపైన ఉన్న అధికారులు దిగి కుంట వద్దకు వచ్చి పరిశీలించారు. అదే సమయంలో పెద్దమ్మగుడి వైపు వెళ్లినట్లు స్థానికులు కాసిపేట ఎస్సై ప్రవీణ్‌కుమార్‌కు ఫోన్ చేశారు. అటవీ అధికారులు అక్కడికి వెళ్లగా తిరిగి గుట్ట వైపు వెళ్లినట్లు నిర్ధారించుకున్నారు. గుడి సమీపంలో పులిని చూసిన రైతులు భయాందోళనకు గురయ్యారు. పులి సంచారంతో కన్నాల, తాండూర్ మండలం కర్షలగ్టం, కాసిపేట మండలం పెద్ద బుగ్గ ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment