పర్యవేక్షణ.. క్రమశిక్షణ లోపం
● గురుకులాల్లో ఘటనలతో ఆందోళన ● విద్యార్థుల వద్ద సెల్‌ఫోన్లు.. ● రెండేళ్లలో పది మంది సస్పెండ్, ఒకరి మృతి
చెన్నూర్: అధికారుల పర్యవేక్షణ లోపిస్తోంది. ఫలితంగా విద్యార్థుల్లో క్రమశిక్షణ కొరవడుతోంది. కుమారులు గురుకులాల్లో చదువుకుని ప్రయోజకులు అవుతారని ఆశిస్తున్న తల్లిదండ్రులకు నిరాశే ఎదురవుతోంది. ఉన్నత చదువులు చదివి పాఠశాల, తల్లిదండ్రులకు పేరు తేవాల్సిన విద్యార్థులు గాడి తప్పుతున్నారు. కలిసి మెలిసి చదువుకోవాల్సిన చోట ఒకరిపైనొకరు దాడులు చేసుకుంటూ బంగారు భవిష్యత్‌ను నాశనం చేసుకుంటున్నారు. ఇప్పటివరకు జరిగిన ఘటనల్లో పది మంది విద్యార్థులను సస్పెండ్ చేశారు. గతంలో చెన్నూర్ మైనార్టీ గురుకుల పాఠశాలలో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న ముగ్గురు విద్యార్థులు ఇంతియాజ్, అమీర్, రెహనుద్దీన్‌లను అధికారులు సస్పెండ్ చేశారు. ఈ విషయంలో తల్లిదండ్రులు ఉపాధ్యాయులు కావాలనే తమ పిల్లలను సస్పెండ్ చేశారని ఆరోపిస్తూ పాఠశాల ఎదుట ధర్నా చేశారు. పాఠశాలలో జరిగిన ఘటనపై ఉన్నతాధికారులు విచారణ జరిపి ఇద్దరు ఉపాధ్యాయులను సస్పెండ్ చేయడంతోపాటు ప్రిన్సిపాల్‌ను బదిలీ చేశారు. ఈ నెల 6న మహాత్మా జ్యోతిబా పూలే గురుకుల పాఠశాలలో విద్యార్థి మనోజ్‌గౌడ్‌పై దాడి చేసి వీడియో తీసి సోషల్ మీడియాలో వైరల్ చేసిన ఘటనలో ఏడుగురిని సస్పెండ్ చేశారు. ప్రిన్సిపాల్ కేవీఎం ప్రకాశ్‌రావు నిర్లక్ష్యం కారణంగా దాడి జరిగిందనే ఉద్దేశంతో ఉన్నతాధికారులు ఆయనను విధుల నుంచి తొలగించారు.
ఇటీవల విద్యార్థి మృతి
చెన్నూర్ మైనార్టీ గురుకుల పాఠశాలలో చెన్నూర్ మండలం బీరెల్లి గ్రామానికి చెందిన ఆదర్శ్ పదో తరగతి విద్యార్థి చదువుతుండేవాడు. సంక్రాంతి సెలవులు ముగిసిన తర్వాత గత నెల 23న పాఠశాలకు వెళ్తున్నానని కుటుంబ సభ్యులకు చెప్పి చెన్నూర్‌కు వచ్చాడు. పాఠశాలకు వెళ్లకుండా చెన్నూర్ ఇంటిగ్రేటెడ్ మార్కెట్ భవనంలో పురుగుల మందు తాగి మృత్యువాత పడ్డాడు. నేటికీ విద్యార్థి మృతికి కారణాలు తెలియరాలేదు.
అవగాహన సదస్సులు ఏర్పాటు చేయాలి
గురుకుల పాఠశాలలో విద్యార్థులు పక్కదారి పట్టకుండా ఏడాదిలో రెండు సార్లు మానసిక నిపుణులతో అవగాహన సదస్సులు ఏర్పాటు చేయించాలని పలువురు సీనియర్ ఉపాధ్యాయులు తెలిపారు. ప్రధానంగా పాఠశాలలో విద్యార్థులకు సె ల్‌ఫోన్‌లు అందుబాటులో ఉండకుండా చూడాల్సిన బాధ్యత ఉపాధ్యాయులు, సిబ్బందిపై ఉంది.
ప్రత్యేక శ్రద్ధ వహిస్తాం
బీసీ గురుకుల పాఠశాలలో ఏడుగురు విద్యార్థులు మరో విద్యార్థిపై దాడి చేయడం మంచి పద్ధతి కాదు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు చేపడుతాం. పదో తరగతి విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటాం. పాఠశాలకు సెల్‌ఫోన్ ఎలా వచ్చిందనే విషయమై విచారణ చేపడుతున్నాం. బాధ్యులపై చర్యలు తీసుకుంటాం.
– శ్రీధర్, ఆర్సీవో మంచిర్యాల
వసతిగృహాల్లో సెల్‌ఫోన్లు
గురుకుల పాఠశాలల్లో పదో తరగతి వంద శాతం ఉత్తీర్ణత సాధించాలని జిల్లా ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేస్తున్నారు. చక్కటి ఫలితాలు తీసుకు రావా లనే ఉద్దేశంతో ఉపాధ్యాయులు విద్యార్థులకు స్వేచ్ఛనిస్తున్నట్లు తెలిసింది. ఓ వైపు స్వేచ్ఛనివ్వడం, మరోవైపు ప్రిన్సిపాల్, వార్డెన్‌ల పర్యవేక్షణ లోపించడం కారణంగా విద్యార్థులు రాత్రివేళల్లో సెల్‌ఫోన్లు వినియోగిస్తున్నట్లు సమాచారం. వసతిగృహాల్లోని విద్యార్థులకు సెల్‌ఫోన్లు ఎక్కడివనేది తేలాల్సి ఉంది. సెల్‌ఫోన్‌లో రీల్స్ చూస్తూ హింసా ప్రవృత్తిని అలవర్చుకుంటున్నారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వసతిగృహాల్లో విద్యార్థులకు సెల్‌ఫోన్లపై పూర్తిగా నిషేధం ఉన్నప్పటికీ ఏ విధంగా లోనికి తీసుకెళ్తున్నారు.. ఏ విధంగా వాడుతున్నారో ఉపాధ్యాయులు, సిబ్బంది గమనించకపోవడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment