చెన్నూర్ ప్రజలకు బతుకమ్మ వాగునీరే..
చెన్నూర్: చెన్నూర్ మున్సిపాలిటీగా ఏర్పడ్డప్పటికీ ప్రజల తాగునీటి ఇబ్బందులు తప్పడం లేదు. ప్రజల అవసరాలకు సరిపడా తాగునీరు సరఫరా చేయకపోవడంతో మహిళలు బిందెలు, పురుషులు క్యాన్లు పట్టుకుని నీటి కోసం సుదూర ప్రాంతాలకు వెళ్లాల్సిన పరిస్థితి ఉంది. మిషన్ భగీరథ పథకం ద్వారా సక్రమంగా నీటి సరఫరా లేక 60 ఏళ్లుగా బతుకమ్మ వాగు వద్ద గల సంపునీరే దిక్కవుతోంది. బతుకమ్మ వాగు, మిషన్ భగీరథ నీరు కొన్ని వార్డులకే సరఫరా అవుతుండటంతో జెండావాడ, మహంకాళివా డ, గంగపుత్ర కాలనీ, కాజీపూర, లైన్‌గడ్డ, ఇందిరానగర్, రజకవాడ, కుమ్మరిబొగుడ, శిశుమందిర్ కాలనీల వాసులు మైసమ్మ ఆలయం వద్ద గల బతుకమ్మ వాగు నుంచి వచ్చే నల్లా వద్దకు వెళ్లి నీటిని తెచ్చుకోవాల్సిన దుస్థితి నెలకొంది. మున్సిపాలిటీ పరిధిలో గత నెల తాగునీరు కలుషితం కావడంతో బట్టిగూడెం, పద్మశాలివాడ, కొటబొగుడ కాలనీలకు చెందిన సుమా రు 100 మంది డయేరియా బారిన పడ్డారు. దీంతో కలెక్టర్ కుమార్ దీపక్ బతుకమ్మ వాగు సంపును సందర్శించారు. రెండురోజుల పాటు బతుకమ్మవాగు నీటిని నాలుగు వాడలకు నిలిపివేశారు. వాటర్ ప్లాంట్లతో పాటు బతుకమ్మ వాగు సంపు నుంచి వచ్చే నీటికి పరీక్షలు నిర్వహించారు. నీటి నాణ్యతలో ఎలాంటి లోపం లేకపోవడంతో నీటి సరఫరాను పునరుద్ధరించారు. మున్సిపాలిటీ పరిధిలో 20 వాటర్ ప్లాంట్లున్నాయి. ప్లాంట్‌కు 500 లీటర్ల చొప్పున 10వేల లీటర్ల నీటిని విక్రయిస్తున్నారు. వేసవి వచ్చిందంటే మరో 5వేల లీటర్ల డిమాండ్ ఉంటుందని వాటర్ ప్లాంట్ల నిర్వాహకులు చెబుతున్నారు. ఈ లెక్కన మున్సిపాలిటీలో ప్రజలు 80శాతం మంది రోజుకు 20లీటర్ల ప్లాంట్ వాటర్ కోనుగోలు చేస్తున్నారు.
మురికినీరు వస్తోంది
బతుకమ్మ వాగు పైపులైన్ వేసి 60 ఏళ్లు దాటింది. దీంతో నల్లాల నుంచి మురికినీరు వస్తోంది. మైసమ్మ గుడి పక్కనున్న నల్లా నీటిని తెచ్చుకుంటున్నాం. మిషన్ భగీరథ నల్లాలు పేరుకే ఉన్నాయి. అధికారులు వెంటనే స్పందించి తాగునీటి సమస్య పరిష్కరించాలి.
– మండెల రమేశ్, జెండావాడ, చెన్నూర్
చెన్నూర్ ప్రజలకు బతుకమ్మ వాగునీరే..
Comments
Please login to add a commentAdd a comment