
గంజాయి నియంత్రణపై స్పెషల్ ఫోకస్
● రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్‌ఝా
మంచిర్యాలక్రైం: గంజాయి నియంత్రణపై స్పెషల్ ఫోకస్ పెట్టాలని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్‌ఝా అన్నారు. మంచిర్యాల, గోదావరిఖని, పెద్దపల్లి సబ్ డివిజన్ పోలీస్ అధికారులతో మంగళవారం కమిషనరేట్ కార్యాలయంలో నేర సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్ల వారీగా పెండింగ్ కేసుల వివరాలు, అరెస్టులు, కేసుల దర్యాప్తులు, సాక్ష్యాధారాల సేకరణ, చార్జిషీట్‌కు సంబంధించి ప్రస్తుత పరిస్థితిపై అడిగి తెలుసుకున్నారు. ప్రధానంగా పోక్సో కేసులు, ఎస్సీ, ఎస్టీ, మిస్సింగ్, రోడ్డు ప్రమాదాలు, గంజాయి, గేమింగ్ యాక్ట్, తదితర కేసులపై సమీక్షించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రతీ పోలీస్ అధికారి చట్టపరిధిలో పనిచేయాలన్నారు. క్రమశిక్షణ, నిబద్ధతతో పనిచేసిన వారికి గుర్తింపు ఉంటుందన్నారు. ఎస్సీ, ఎస్టీ కేసుల్లో పారదర్శకంగా, న్యాయపరంగా విచారణ జరపాలన్నారు. విలేజ్ పోలీస్ ఆఫీసర్లను నియమించి సమాచార వ్యవస్థను పటిష్టం చేసుకోవాలని సూచించారు. పోలీస్ స్టేషన్‌కు వచ్చే ఫిర్యాదుదారులతో మర్యాద పూర్వకంగా మాట్లాడి పోలీస్ వ్యవస్థపై ప్రజలకు నమ్మకం కలిగించాలన్నారు. రోడ్డు ప్రమాదాలు అధికంగా జరిగే ప్రాంతాల్లో విలేజ్ సేఫ్టీ కమిటీలు ఏర్పాటు చేయాలన్నారు. గంజాయి నియంత్రణకు పటిష్టమైన నిఘా వ్యవస్థను ఏర్పాటు చేయాలని సూచించారు. గంజాయి విక్రయం, సేవించేవారిపై కఠినంగా వ్యవహరించాలని హెచ్చరించారు. సమావేశంలో డీసీపీలు ఎగ్గడి భాస్కర్, కరుణాకర్, అడిషనల్ డీసీపీ రాజు, ఎస్‌బీ ఏసీపీ రాఘవేంద్రరావు, ఏసీపీలు రమేశ్, కృష్ణ, నరసింహులు, మల్లారెడ్డి, ఏఆర్‌ఏసీపీ ప్రతాప్, ఏవో శ్రీనివాస్, సీఐలు, ఎస్సైలు పాల్గొన్నారు.