
ఓలాలో భారీ అగ్నిప్రమాదం
● యంత్రాలు, కలప దగ్ధం
కుంటాల: మండలంలోని ఓలా గ్రామంలో శనివారం అర్ధరాత్రి భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన యువకులు వేల్పూర్ రంజిత్, రాజశేఖర్, రాకేశ్ వడ్రంగి కులవృత్తి చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఇంటి పక్కనే గల మూడు షెడ్లు వేర్వేరుగా ఏర్పాటు చేసుకుని అనుమతి పొందిన టేకు కలపతో గృహ నిర్మాణ, పెళ్లిళ్ల పనులకు అవసరమయ్యే ఫర్నిచర్‌ను తయారు చేస్తుంటారు. శనివారం ప్రమాదవశాత్తు షెడ్లలో మంటలు చెలరేగాయి. పక్కనే నిద్రిస్తున్న మహారాష్ట్ర కూలీలకు మంటల వేడిని గమనించి కుటుంబ సభ్యులను అప్రమత్తం చేశారు. అప్పటికే మంటలు ఎగిసిపడి షెడ్లలో ఉన్న టేకు కలప, యంత్రాలు, సామాగ్రి పూర్తిగా దగ్ధమయ్యాయి.
రూ.34 లక్షల ఆస్తినష్టం..
ఉగాది అమావాస్య పురస్కరించుకుని శనివారం వేల్పూర్ రంజిత్, రాజశేఖర్, రాకేశ్‌లు రైతులకు అవసరమయ్యే అరక పనులు చేసి నిద్రించారు. ఒకేసారి షెడ్లలో మంటలు వ్యాపించడంతో అందులో ఉన్న కలప, యంత్రాలు, వస్తువులు అగ్నికి బుగ్గిపాలయ్యాయి. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది వచ్చి మంటలార్పి వేశారు. రంజిత్‌కు షెడ్ లో ఉన్న రూ.8 లక్షల కలప, రూ.3 లక్షల విలువ చేసే యంత్రాలు, సామగ్రి, రాజశేఖర్‌కు షెడ్‌లో రూ.10 లక్షల కలప, రూ.3 లక్షల యంత్రాలు, సామగ్రి, రాకేశ్ షెడ్‌లో ఉన్న రూ.5 లక్షల కలప, రూ. 5 లక్షల యంత్రాలు, పనిముట్లు కాలి బూడిదయ్యాయి. రూ.34 లక్షల ఆస్తినష్టం వాటిల్లిందని బాధితులు వాపోయారు. ఘటనా స్థలాన్ని ఎస్సై సి.అశోక్ పరిశీలించారు. ప్రభుత్వం తమను ఆదుకుని నష్టపరిహారం అందించాలని వేడుకున్నారు.