
ఇక మహిళలు సేఫ్!
● అందుబాటులో టీ –సేఫ్ యాప్ ● అతివల రక్షణకు పోలీస్‌శాఖ చర్యలు ● ప్లేస్టోర్ నుంచి డౌన్‌లోడ్‌కు అవకాశం
నిర్మల్‌ఖిల్లా: ప్రతీరోజు ఎక్కడో ఒకచోట మహిళలపై అత్యాచారాలు, అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయి. ఇటీవల జర్మనీ యువతిపై రాష్ట్ర రా జధాని హైదరాబాద్ నగరంలో జరిగిన అత్యాచార ఘటన ఉలిక్కిపాటుకు గురిచేసింది. ఇలాంటి దారుణాలకు అడ్డుకట్ట వేసే లక్ష్యంతో తెలంగాణ రాష్ట్ర పోలీస్ శాఖ టీ–సేఫ్ యాప్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. మహిళల రక్షణ కోసం ఈ యాప్‌ను రూపకల్పనచేసి దాదాపు ఏడాది గడుస్తున్నా సరైన అవగాహన లేక యాప్‌ను వినియోగిస్తున్న వారి సంఖ్య చాలా తక్కువగా ఉంది. మహిళలు దూర ప్రయాణాలు చేస్తున్నప్పుడు టీ –సేఫ్ యాప్‌లో నమోదు చేసుకోవడం ద్వారా సురక్షితంగా గమ్యం చేరవచ్చని పోలీసులు పేర్కొంటున్నారు.
ఇలా చేస్తే సేఫ్..
మొబైల్‌లో ప్లేస్టోర్ ద్వారా టీ– సేఫ్ యాప్ అని టైప్ చేసి సెర్చ్ చేస్తే రాష్ట్ర ప్రభుత్వ పోలీస్ శాఖ అందుబాటులోకి తెచ్చిన యాప్ కనిపిస్తుంది. దీన్ని డౌన్‌లోడ్ చేసుకొని పేరు, ఫోన్ నంబర్ నమోదు చేసి రిజిస్టర్ అవ్వాల్సి ఉంటుంది. హెల్ప్ సిటిజన్ విభాగంలో క్లిక్ చేసి ప్రయాణిస్తున్న ప్రాంతం పేరు ప్రయాణించే వాహనం, దాని రిజిస్ట్రేషన్ నంబరు నమోదు చేయాలి. ఒకవేళ రైలు ప్రయాణం చేస్తే ఆ రైలు రూట్ నంబర్ ఎంటర్ చేయాలి. అనంతరం ప్రయాణం ప్రారంభించే ముందు స్టార్ట్ బటన్ నొక్కగానే సదరు సమాచారం పోలీసుల పర్యవేక్షణలోకి వెళ్తుంది. ఇక అప్పటి నుంచి ఆ వాహనం లొకేషన్ గమ్యం చేరేవరకు పోలీసుల పర్యవేక్షణలో ఉంటుంది.
అనుకోని ఘటన ఎదురైతే..
ప్రయాణిస్తున్న వాహనం రూటు మారినా, ప్రామాణిక సమయానికన్నా ఆలస్యమైనా పోలీసుల నుంచి ప్రతీ ఐదు నిమిషాలకు ఒకసారి హెచ్చరిక సందేశం వస్తుంది. దానికి వినియోగదారు నుంచి రిప్లయ్ ఇవ్వకుంటే కేసును అనుమానాస్పదంగా పరిగణించి నేరుగా ప్రయాణిస్తున్న వాహనం వ్యక్తి వివరాలు డయల్ 100కు వెళ్తాయి. లొకేషన్ ఆధారంగా సమీప పోలీస్‌స్టేషన్ లేదా పెట్రోలింగ్ వాహనానికి సమాచారం చేరవేస్తారు. నిమిషాల వ్యవధిలో పోలీసు సిబ్బంది అక్కడికి చేరుకొని పరిస్థితిని బట్టి అవసరమైన చర్యలు తీసుకుంటారు. అనుకోని సందర్భాల్లో విపత్కర పరిస్థితుల్లో ఇబ్బందులు పడే మహిళలను పరిరక్షించేందుకు టీ సేఫ్ యాప్ చక్కగా ఉపయోగపడుతుందని ఒంటరి మహిళలకు, యువతులకు రక్షణ కవచంలా పని చేస్తుందని జిల్లా పోలీసులు పేర్కొంటున్నారు.