
ఇసుక అక్రమ రవాణాపై ఉక్కుపాదం
ఆదిలాబాద్‌టౌన్(జైనథ్): ఇసుక అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపుతామని ఆదిలాబాద్ డీఎస్పీ ఎల్.జీవన్‌రెడ్డి పేర్కొన్నారు. ఎస్పీ ఆదేశాల మేరకు జిల్లాలో అక్రమ దందాలు, అసాంఘిక కార్యకలాపాల నియంత్రణకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. జైనథ్ పోలీస్‌స్టేషన్ పరిధిలో గురువారం అర్ధరాత్రి స్పెషల్ ఆపరేషన్ నిర్వహించి ఇసుకను అక్రమంగా తరలిస్తున్న మూడు టిప్పర్లు, ఒక జేసీబీ స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. శుక్రవారం జైనథ్ పోలీస్‌స్టేషన్‌లో ఇందుకు సంబంధించిన వివరాలు వెల్లడించారు. జైనథ్ సీఐ సాయినాథ్, ఎస్సై పురుషోత్తం, పోలీస్ సిబ్బంది శివాజీ, నర్సింగ్, మనోజ్ కలిసి జైనథ్ మండలం సాంగ్వి గ్రామంలో పెన్‌గంగా నది నుంచి అక్రమంగా ఇసుక తరలిస్తున్నారనే సమాచారం మేరకు తనిఖీలు చేపట్టారు. సాంగ్వి నుంచి ఆదిలాబాద్‌కు అక్రమంగా ఇసుక తరలిస్తున్న మూడు టిప్పర్లు, ఒక జేసీబీని సీజ్ చేసినట్లు తెలిపారు. వాటి డ్రైవర్లు గంగాధర్, షేక్ మోసిన్, వెంకటేశ్, సతీశ్, వాహన యజమానులు వంగల తిరుపతిరెడ్డి, రాకేశ్‌రెడ్డి, కొండా లక్ష్మణ్, జ్ఞానేశ్వర్‌పై కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. ఇసుక సరఫరా చేస్తున్న పెందూరు గణేశ్, పెందూర్ మాధవ్, నాగుల నరేశ్‌పై ఇసుక దొంగతనం కేసు నమోదు చేసినట్లు తెలిపారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠినచర్యలు తప్పవని హెచ్చరించారు.