
గంజాయి రవాణా.. ముగ్గురు అరెస్ట్
జైపూర్: జల్సాలకు అలవాటుపడ్డ ముగ్గురు యువకులు ఆసిఫాబాద్ నుంచి వేలాలకు గంజాయి రవాణా చేస్తూ పట్టుబడినట్లు జైపూర్ ఏసీపీ వెంకటేశ్వర్ తెలిపారు. జైపూర్ అసిస్టెంట్ కమిషనరేట్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో శ్రీరాంపూర్ సీఐ వేణుచందర్, ఎస్సై శ్రీధర్‌తో కలిసి ఏసీపీ వెంకటేశ్వర్ శుక్రవారం వివరాలు వెల్లడించారు. వేలాల గ్రామానికి చెందిన దుర్గం సాయి కార్తీక్, సుందిళ్ల సంపత్, ప్యాగా శేఖర్‌లు బైక్‌పై ఆసిఫాబాద్‌కు వెళ్లి అక్కడ గుర్తు తెలియని వ్యక్తుల వద్ద సుమారు 500గ్రాముల గంజాయిని రూ.5వేలకు కొనుగోలు చేసి ఇక్కడికి తీసుకొచ్చి చిన్న ప్యాకెట్లుగా తయారు చేస్తున్నారు. అనంతరం ఒక్కో ప్యాకెట్‌ను రూ.500ల చొప్పున విక్రయిస్తున్నారు. ఈక్రమంలో శుక్రవారం గంజాయి విక్రయించేందుకు వెళ్తుండగా వేలాల ఇసుక క్వారీ వద్ద ముగ్గురు యువకులను పోలీసులు పట్టుకున్నారు. వారి వద్ద నుంచి 290గ్రాముల గంజాయి, రెండు బైక్‌లు, రెండు సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. గంజాయి విక్రయించినా, రవాణా చేసినా కఠిన చర్యలు తీసుకుంటామని, పీడీయాక్టులు సైతం నమోదు చేస్తామని ఏసీపీ హెచ్చరించారు. సమావేశంలో జైపూర్ రెండో ఎస్సై రామలక్ష్మి ఉన్నారు.