
కల్మలపేటలో వృద్ధుడి హత్య!
● అనుమానాస్పద మృతిగా కేసు నమోదు
వేమనపల్లి: గుర్తుతెలియని వ్యక్తుల చేతిలో వృద్ధుడు హత్యకు గురైన సంఘటన మండలంలో చోటు చేసుకుంది. నీల్వాయి ఎస్సై శ్యాంపటేల్ తెలిపిన వివరాల మేరకు మండలంలోని కల్మలపేటకు చెందిన బద్ది లచ్చయ్య (64) మొదటి భార్య మధునక్క మృతి చెందగా లక్ష్మి అనే మహిళను రెండో పెళ్లి చేసుకున్నాడు. ఇద్దరు భార్యలకు నలుగురు కుమారులు నారాయణ, పోచన్న, రాములు, తిరుపతి ఉన్నారు. లచ్చయ్య కౌలు వ్యవసాయం, గుడుంబా అమ్ముకుంటూ అదేఇంట్లో వేరే గదిలో ఉంటున్నాడు. శనివారంరాత్రి చిరుజల్లులు కురుస్తుండగా తన ఎక్స్‌ఎల్ వాహనంపై బయటకు వెళ్లివచ్చాడు. తెల్లారేసరికి ఇంట్లో రక్తపు మడుగులో పడి ఉన్నాడు. గమనించిన కోడలు సమ్మక్క ఏడుస్తూ కొడుకులకు చెప్పడంతో విషయం బయటకు పొక్కింది. గుర్తు తెలియని వ్యక్తులు హత్యకు ఉపయోగించిన ఎడ్లబండికి ఉండే గడుగొయ్య అక్కడే వదిలేసి వెళ్లిపోయారు. పెద్ద కొడుకు నారాయణ ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు అన్ని కోణాల్లో విచారణ చేస్తున్నారు. ఘటన స్థలాన్ని జైపూర్ ఏసీపీ వెంకటేశ్వర్లు , చెన్నూర్‌రూరల్ సీఐ సుధాకర్, ఎస్సై శ్యాంపటేల్ పరిశీలించారు.

కల్మలపేటలో వృద్ధుడి హత్య!