
● బాధిత కుటుంబాల భరోసాకు ప్రభుత్వం కార్యాచరణ ● ప్రత్యేక
ఉన్న ఊర్లో ఉపాధిలేకనో.. గల్ఫ్ దేశాలకు వెళ్తే జీవనం మెరుగుపడుతుందనో.. తమ కుటుంబాలు బాగుపడతాయనో.. కారణం ఏదైనా కావచ్చు.. ఉమ్మడి జిల్లా నుంచి రెండు దశాబ్దాలకుపైగా ఎడారి దేశాలకు వలసలు క్రమంగా పెరుగుతున్నాయి. అయితే విధి నిర్వహణలో అనారోగ్యం రీత్యా, ప్రమాదాల బారిన పడి, అక్కడి వాతావరణ పరిస్థితులు అనుకూలించక.. పలుకారణాలతో మృత్యువాత పడుతున్న ఘటనలు ఎన్నో ఉన్నాయి. వారిపై ఆధారపడిన బాధిత కుటుంబాలు సామాజికంగా, ఆర్థికంగా కొట్టుమిట్టాడుతున్న పరిస్థితులు ఉమ్మడి జిల్లాలో కోకొల్లలు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత గల్ఫ్ కార్మికుల సంక్షేమంపై ప్రత్యేక దృష్టి సారించింది. ఈ నేపథ్యంలోనే 15 రోజుల క్రితం ప్రత్యేక సలహా మండలిని ఏర్పాటు చేసింది. వారి జీవన విధానంపై అధ్యయనం చేసేందుకు అవకాశం కల్పించింది. నేడు అంతర్జాతీయ కార్మికుల స్మారక దినోత్సవం సందర్భంగా కథనం.
నిర్మల్‌ఖిల్లా: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి గల్ఫ్ దేశాలైన దుబాయ్, మస్కట్, సౌదీ అరేబియా, బహ్రెయిన్, ఇరాక్, ఇరాన్, కువైట్ తదితర దేశాలకు రెండు దశాబ్దాలకు ముందు నుంచే వలసలు ప్రారంభం అయ్యాయి. ప్రస్తుతం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి దాదాపు 70 వేలకు పైగా మంది కార్మికులు వివిధ గల్ఫ్ దేశాల్లో ఉపాధి పొందుతున్నట్లు సమాచారం. కాగా ఎక్కువమంది నైపుణ్య రహిత కార్మిక రంగంలోనే ఉపాధి పొందేందుకు వెళుతుండడంతో అక్కడి పరిస్థితులు అనుకూలంగా లేకపోవడం వల్ల అనారోగ్యం బారిన పడడం, ఒత్తిడికి గురికావడం, ప్రమాదాల బారిన పడటం వంటి అనేక కారణాలరీత్యా తనువుచాలిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ప్రభుత్వం గల్ఫ్ కార్మికుల సంక్షేమం కోసం తీసుకునే విధానపరమైన నిర్ణయాలపై సలహాలు, సూచనలు అందించేందుకు ప్రత్యేక గల్ఫ్ సంక్షేమ సలహా మండలిని ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. దీనికి విశ్రాంత ఐఎఫ్‌ఎస్ అధికారి బిఎం వినోద్ కుమార్‌ను చైర్మన్‌గా, 12 మందిని సభ్యులుగా నియమించింది. ఇందులో నిర్మల్ జిల్లాకు చెందిన స్వదేశ్ పరికిపండ్లకు అవకాశం కల్పించింది. దీంతో ఉమ్మడి జిల్లాకు చెందిన గల్ఫ్ బాధిత కుటుంబాల్లో కాసింత భరోసా కల్పించినట్లు అయింది.
మృతుల కుటుంబాలకు పరిహారం..
గల్ఫ్ దేశాల్లో మృత్యువాత పడిన కార్మికుల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం తరపున రూ.5 లక్షల పరిహారం అందజేస్తోంది. ఇప్పటికే ఉమ్మడి జిల్లా నుంచి రెండు దశల్లో ఈ పరిహారం ఆయా బాధిత కుటుంబాల ఖాతాల్లో ఇప్పటికే జమ అయ్యాయి.
అమలుచేయాల్సినవి ఇవే..
● ఎన్నారై పాలసీ అమలు
● ఏజెంట్ల మోసాలకు అడ్డుకట్ట వేయడం
● ఎంబసీలో తెలుగు అధికారుల నియామకం
● మృతదేహాలను స్వస్థలాలకు తీసుకురావడం
● అంత్యక్రియలకు ఆర్థికసాయం
● బాఽధిత కుటుంబాలకు పరిహారం
● వివిధ కారణాలతో అక్కడి జైళ్లో మగ్గుతున్న్ల కార్మికులకు న్యాయ సహాయం
● ప్రమాద ఆరోగ్య బీమా అమలు
● నైపుణ్య శిక్షణ కార్యక్రమాల నిర్వహణ
● తిరిగివచ్చిన కార్మికులకు పునరావాసం
నేడు నిర్మల్‌లో ప్రత్యేక కార్యక్రమం
అంతర్జాతీయ కార్మిక స్మారక దినోత్సవాన్ని పురస్కరించుకుని సోమవారం నిర్మల్ జిల్లా కేంద్రంలోని విశ్రాంత ఉద్యోగుల సంఘ భవనంలో ఉదయం 9 గంటలకు ప్రత్యేక కార్యక్రమం నిర్వహించనున్నారు. విధి నిర్వహణలో గాయపడిన లేదా మృతి చెందిన, అంగవైకల్యం పొందిన కార్మికుల స్మారకార్థం ఐక్యరాజ్యసమితి ఆధ్వర్యంలో ప్రపంచ వ్యాప్తంగా అంతర్జాతీయ కార్మికుల స్మారక దినోత్సవం నిర్వహిస్తున్న నేపథ్యంలో ‘చనిపోయిన వారిని స్మరించండి–బతికున్న వారికోసం పోరాడండి’ అనే నినాదంతో టీపీసీసీ ఎన్నారై విభాగం ఆధ్వర్యంలో ‘అమరుల దినోత్సవం’ నిర్వహించనున్నట్లు గల్ఫ్ కార్మిక సంక్షేమ రాష్ట్ర సలహా మండలి సభ్యులు స్వదేశ్ పరికిపండ్ల తెలిపారు.
స్వగ్రామంలో గల్ఫ్ కార్మికుడి మృతదేహం (ఫైల్)