పాఠాలు సరే.. పుస్తకాలేవీ? | - | Sakshi
Sakshi News home page

పాఠాలు సరే.. పుస్తకాలేవీ?

Published Wed, Jul 26 2023 8:36 AM | Last Updated on Wed, Jul 26 2023 8:36 AM

కౌడిపల్లి జూనియర్‌ కళాశాలలో పాఠాలు వింటున్న విద్యార్థులు - Sakshi

కౌడిపల్లి జూనియర్‌ కళాశాలలో పాఠాలు వింటున్న విద్యార్థులు

ఇంటర్‌ కళాశాలలు ప్రారంభమై 50 రోజులు

ఇప్పటికీ సరఫరా కాని బుక్స్‌

అయోమయంలో విద్యార్థులు

ఇంటర్‌ కళాశాలలు ప్రారంభమై 50 రోజులు అవుతున్నా జిల్లాలో నేటికీ విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు అందలేదు. అధ్యాపకులు చెప్పే పాఠాలు విని ఇళ్లకు తిరిగి వెళ్తున్నారు. దీంతో చదువులు ఎలా సాగుతాయని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే రాష్ట్రంలోనే మెదక్‌ ఇంటర్‌ ఫలితాల్లో ఆఖరు స్థానంలో నిలిచింది. – మెదక్‌జోన్‌

● జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేట్‌ కళాశాలలు కలిపి మొత్తం 30 ఉండగా వాటిలో ఆరువేల పైచిలుకు విద్యార్థులు చదువుకుంటున్నారు.

● ఇంకా అడ్మిషన్లు జరుగుతుండడంతో వీరి సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధ్యాపకులు చెబుతున్నారు.

● జూన్‌ 1న కళాశాలలు ప్రారంభమైనా నేటికీ విద్యార్థులకు పుస్తకాలు ఇవ్వకపోవడంతో అధ్యాపకులు చెప్పే పాఠాలు మాత్రమే వింటున్నారు.

● అయితే పుస్తకాలు లేకుండా బోధించటం కష్టమేనని.. వీటితో విద్యార్థులకు పెద్దగా ప్రయోజనం ఉండదని అధ్యాపకులు చెబుతున్నారు.

● ప్రభుత్వ కాలేజీల్లో ఎక్కువగా మారుమూల గ్రామీణ ప్రాంతాలకు చెందిన నిరుపేద విద్యార్థులే చదువుకుంటారు.

● వీరు సొంతంగా డబ్బులు వెచ్చించి పుస్తకాలు కొనలేని పరిస్థితిలో ఉంటారు. ప్రభుత్వం ఉచితంగా అందించే పుస్తకాలపైనే ఆధారపడుతుంటారు.

● గతేడాది సైతం కళాశాలలు ప్రారంభమైన రెండు నెలలకు ప్రభుత్వం పుస్తకాలను సరఫరా చేసినట్టు విద్యార్థులు చెబుతున్నారు.

● ప్రతిసారి పుస్తకాలు అందించడంలో నిర్లక్ష్యమే జరుగుతుందని.. సకాలంలో అందక చదువు సాగడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఫలితాల్లో జిల్లా ఆఖరుస్థానం

● గడిచిన రెండేళ్లుగా ఇంటర్మీడియట్‌ ఫలితాల్లో మెదక్‌ ఆఖరుస్థానంలో నిలుస్తోంది.

● ఈఏడాది మేలో వెలువడిన ఫలితాల్లో జిల్లావ్యాప్తంగా 6,364 మంది పరీక్షలు రాయగా 2,462 మంది మాత్రమే ఉత్తీర్ణులయ్యారు. కేవలం 38శాతం మాత్రమే పాసయ్యారు.

● ద్వితీయ సంవత్సరంలో 5,320 మంది పరీక్షలు రాయగా 2,785 మంది ఉత్తీర్ణులు కాగా 52 శాతంతో రాష్ట్రంలో వెనకబాటులో నిలిచింది.

● అయినప్పటికీ అధికారుల్లో ఏమాత్రం మార్పు రావడం లేదు. గతేడాది సైతం కళాశాలలు ప్రారంభమైన రెండు నెలలకు అందించారు.

● విద్యార్థులకు సకాలంలో పుస్తకాలు అందించడంలో ప్రభుత్వం విఫలమవుతుందని విద్యార్థులు, తల్లిదండ్రులు మండిపడుతున్నారు.

పాతవి సర్దుబాటు

ఇప్పటికీ పుస్తకాలు రాకపోవడంతో గతేడాదికి చెందిన ద్వితీయ సంవత్సరం పుస్తకాలను కొంతమంది విద్యార్థులకు సర్దుబాటు చేస్తున్నారు.

అవి కూడా కొంతమందికి మాత్రమే సర్దుబాటు చేయడంతో పుస్తకాలు రాని మిగితా పిల్లలు ఇళ్లకు వెళ్లిపోతున్నారు.

కొనుగోలు చేద్దామన్నా బయట మార్కెట్‌లో సైతం దొరకడం లేదని చెబుతున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement