
17 ఏళ్ల కల సాకారం
నెరవేరిన 2008 డీఎస్సీ అభ్యర్థుల కల
● సుదీర్ఘ నిరీక్షణకు తెర● ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 184 మంది నియామకం
మెదక్‌జోన్/ప్రశాంత్‌నగర్(సిద్దిపేట): ఒకటి కాదు.. రెండు కాదు ఏకంగా 17 ఏళ్ల పోరాటానికి తెరపడింది. 2008లో ఉమ్మడి ఏపీలో డీఎస్సీ నిర్వహించిన అప్పటి ప్రభుత్వం, ఎస్జీటీ ఉద్యోగాలను డీఈడీ, బీఈడీ అభ్యర్థులతో 70: 30తో భర్తీ చేసే విధంగా ప్రణాళికా రూపొందించింది. అయితే డీఈడీ చేసిన అభ్యర్థులు ఎస్జీటీ ఉద్యోగాలు పూర్తిగా మాకే ఇవ్వాలని డిమాండ్ చేయగా, నాడు వారితోనే ఉద్యోగాలు భర్తీ చేసింది. కాగా అప్పటికే అప్పటికే ధృవపత్రాల పరిశీలన పూర్తి చేసుకున్న బీఈడీ అభ్యర్థులు తమకు ఎస్జీటీలో అవకాశం కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు. అదేవిధంగా కోర్టును సైతం ఆశ్రయించారు. 17 ఏళ్ల అనంతరం కోర్టు తీర్పు ఆధారంగా ప్రభుత్వం వారికి కాంట్రాక్ట్ పద్దతిలో ఎస్జీటీ ఉద్యోగాలు కేటాయించింది. నాడు ఉమ్మడి మెదక్ జిల్లాలో 292 మంది బీఈడీ అభ్యర్థులు సర్టిఫికెట్ వెరిఫికేషన్ పూర్తి చేసుకున్నారు. శనివారం సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట జిల్లా విద్యాశాఖ అధికారుల ఆధ్వర్యంలో అభ్యర్థులకు కౌన్సిలింగ్ నిర్వహించి నియామక పత్రాలు అందజేశారు. 292 అభ్యర్థులు గాను 184 మంది హాజరయ్యారు. వీరు ప్రతి నెల రూ. 31,040 వేతనంగా పొందనున్నారు. జీవితంలో తమకు ఉద్యోగం వస్తుందో రాదో అని ఇన్ని రోజులు బాధలో ఉన్న అభ్యర్థుల సుదీర్ఘ ఎదురుచూపులకు తెరపడింది. అలాగే జిల్లాలో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ ఖాళీలు భర్తీ కానున్నాయి. మెదక్ జిల్లావ్యాప్తంగా 1,907 ఎస్జీటీ పోస్టులకు గాను ప్రస్తుతం 1,667 మంది విధుల్లో ఉన్నారు. ప్రస్తుతం 64 మంది విధుల్లో చేరుతుండడంతో ఇంకా 176 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment