
క్షణికావేశం.. మరణ శాసనం
సమస్య వచ్చినప్పుడు మన అనుకునే వారితో చర్చించి పరిష్కరించుకునే మార్గంపై దృష్టి సారించాలి. ఒంటరిగా ఉంటే మానసిక ఆందోళనకు గురై మరింత ఇబ్బంది పడే అవకాశం ఉంది. సానుకూల ఆలోచనలపై ఆసక్తి పెంచుకోవాలి. ఎదుర్కొనే సమస్యలు తాత్కాలికమని గుర్తించాలి. సరైన ఆహారం తీసుకొని, వ్యాయామం చేయాలి. గత విజయాలను గుర్తు చేసుకోవాలి. మనోవేదనకు గురైతే మానసిక వైద్య నిపుణుల సహాయం తీసుకోవాలి.
పెంటాగౌడ్, వైద్యుడు, మెదక్
మెదక్ మున్సిపాలిటీ: అనారోగ్యం, ప్రేమ విఫలం, కుటుంబ సమస్యలు, చదువు, ఉద్యోగం, ఆర్థిక ఇబ్బందులు ఇతర కారణాలతో పలువురు క్షణికావేశానికి గురై తనువు చాలిస్తున్నారు. మానసిక ఒత్తిడి అధిగమించే విషయంలో, భావోద్వేగాలు నియంత్రణ లేక ఇక బతకలేమని నిర్ణయించుకొని ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. జిల్లాలో రోజు రోజుకు పెరుగుతున్న బలవన్మరణాలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. గతేడాది మొత్తం 365 రోజులు ఉండగా, 362 మంది ఆత్మహత్య చేసుకోవడం తీవ్ర ఆందోళనకు గురిచేసే విషయం. ఈ ఏడాది జనవరిలో జిల్లావ్యాప్తంగా 21 మంది తనువు చాలించారు. సమస్య ఏదైనా.. సందర్భం ఏమైనా నేటి తరం యువతతో పాటు కూలీలు, వ్యాపారులు, విద్యార్థులు ఒక్క నిమిషం ఆలోచిస్తే సమస్య తీరుతుందన్న ఆలోచన మరిచి క్షణికావేశానికి గురై బలవన్మరణాలకు పాల్పడుతున్నారు.
ప్రతి సమస్యకు పరిష్కారం
ఇటీవల మెదక్ పట్టణానికి చెందిన మల్లికార్జున రమేష్ వ్యాపారంలో అప్పులు పెరిగిపోవడంతో మానసిక ఒత్తిడికి గురై ఆత్మహత్య చేసుకున్నారు. ఏళ్ల తరబడి వ్యాపా రం చేస్తూ వంద మందికిపైగా ఉపాధి కల్పించిన వ్యక్తి ఆత్మహత్య చేసుకోవడం వ్యాపారులను ఆందోళనకు గురిచేసింది.
ఈనెల 10వ తేదీన చేగుంట మండలం కర్నాల్‌పల్లికి చెందిన ఓ వ్యక్తి అనారోగ్య సమస్యలతో ఆత్మహత్య చేసుకున్నాడు.
11వ తేదీన నర్సాపూర్ మండలం చిన్నచింతకుంటకు చెందిన విద్యార్థిని చదువుకోవడం ఇష్టం లేక ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది.
ఈనెల 10న శివ్వంపేట మండలం చిన్నగొట్టిమక్లకు చెందిన వ్యక్తి కుటుంబ కలహాలు, ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్య చేసుకున్నాడు.

క్షణికావేశం.. మరణ శాసనం
Comments
Please login to add a commentAdd a comment