చికెన్ అమ్మకాలు ఢమాల్!
రామాయంపేట(మెదక్): బర్డ్ ఫ్లూ భయం జిల్లాలోని చికెన్ సెంటర్లను తీవ్రంగా దెబ్బతీసింది. నెల రోజులుగా వ్యాపారం సరిగా సాగకపోవడంతో కొన్ని సెంటర్లు ఇప్పటికే మూతపడ్డాయి. రామాయంపేట, మెదక్, తూప్రాన్, నర్సాపూర్ వంటి పెద్ద పట్టణాలతో పాటు గ్రామాల్లో ప్రతిరోజు టన్నుల కొద్ది చికెన్ విక్రయాలు సాగేవని నిర్వాహకులు చెబుతున్నారు. ప్రస్తుతం అడిగే వారే కరువయ్యారని వాపోతున్నారు. కనీసం తమ వద్ద పనిచేసే వర్కర్లకు వేతనాలు సైతం ఇవ్వలేకపోతున్నామని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
60 శాతం తగ్గిన విక్రయాలు
జిల్లావ్యాప్తంగా సుమారు 180 నుంచి 210 వరకు చికెన్ సెంటర్లు కొనసాగుతున్నాయి. వీటిలో గతంలో ప్రతి రోజూ సుమారు 20 నుంచి 25 టన్నుల మేర చికెన్ విక్రయాలు జరిగేవి. ప్రస్తుతం బర్డ్ ఫ్లూ భయంతో విక్రయాలు 60 శాతం తగ్గిపోయాయని విక్రయదారులు చెబుతున్నారు. జిల్లా కేంద్రమైన మెదక్‌లో 25 చికెన్ సెంటర్లు ఉండగా, ప్రతిరోజూ కనీసం రెండున్నర టన్నుల మేర చికెన్ అమ్మకాలు జరిగేవి. ప్రస్తుతం విక్రయాలు టన్నుకు పడిపోయినట్లు తెలుస్తోంది. జిల్లా కేంద్రంతో పాటు పట్టణాల్లో ఎల్లవేళలా రద్దీగా ఉండే చికెన్ మార్కెట్ ప్రస్తుతం బోసిపోయి కనిపిస్తుంది. అయితే జిల్లాలో బర్డ్ ఫ్లూ లేదని అధికారులు ప్రకటిస్తున్నా, ప్రజలు భయాన్ని వీడటం లేదు. పరిస్థితి ఇలాగే కొనసాగితే చికెన్ సెంటర్లు పూర్తిగా మూతపడే అవకాశం ఉందని నిర్వాహకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
హాస్టల్ పిల్లలకు నో చికెన్ !
ప్రస్తుత పరిస్థితుల్లో సాధ్యమైనంతమేర విద్యార్థులకు చికెన్ పెట్టవద్దని జిల్లా పరిధిలోని ఆయా హాస్టళ్ల వార్డెన్లకు పరోక్ష ఆదేశాలు జారీ అయ్యాయి. దీంతో కొన్ని హాస్టళ్లలో విద్యార్థులకు చికెన్ పెట్టడం మానేశారు. కొన్ని హాస్టళ్లలో మాత్రం వార్డెన్లు చికెన్ వండి పెడుతున్నారని పలు హాస్టళ్ల సంక్షేమాధికారులు పే ర్కొన్నారు. ఈ విషయమై అధికారుల నుంచి తమకు స్పష్టమైన ఆదేశాలు అందలేదని స్పష్టం చేశారు.
‘బర్డ్ ఫ్లూ’ భయంతో జనం విముఖత
జిల్లాలో మూతపడిన పలు చికెన్ సెంటర్లు
నష్టాల బాటలో నిర్వాహకులు
ప్రజలను చైతన్యపర్చాలి
బర్డ్ ఫ్లూపై ప్రజల్లో నెలకొన్న ఆందోళన, అపోహను తొలగించడానికి ప్రభుత్వం కృషి చేయాలి. వైరస్ పుకార్లతో పౌల్ట్రీకి అనుబంధంగా ఉన్న పలుశాఖలు ఇబ్బందుల పాలవుతున్నాయి. చికెన్ అమ్మకాలు 60 శాతం మేర తగ్గాయి. ఇప్పటికై నా ప్రభుత్వం చర్యలు తీసుకొని ప్రజలను చైతన్యపర్చాలి.
– ఇంతియాజ్ (బిలాల్),
జిల్లా చికెన్ సెంటర్ల సంఘం ప్రతినిధి
చికెన్ అమ్మకాలు ఢమాల్!
Comments
Please login to add a commentAdd a comment