
నీటిని తోడేస్తే కఠిన చర్యలు
నీటిపారుదల శాఖ ఏఈ హరీష్
కొల్చారం(నర్సాపూర్): వేసవికాలం కావడం, చెరువుల్లో నీటి నిల్వలు తగ్గుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో అక్రమంగా నీటిని తోడేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని నీటిపారుదల శాఖ ఏఈ హరీష్ హెచ్చరించారు. మండలంలోని సంగాయిపేట పెద్ద చెరువులోని నీటిని కొందరు ముందస్తు అనుమతులు లేకుండా మోటార్ల ద్వారా నీటిని తోడేస్తున్నారని రెండు రోజుల క్రితం గ్రామానికి చెందిన మత్స్యకారులు నీటిపారుదల శాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు. శుక్రవారం చెరువును సందర్శించిన ఏఈలు హరీష్, మాధురి చెరువులో ఏర్పాటు చేసిన మోటార్లను వెంటనే తొలగించాలని సంబంధిత వ్యక్తులను ఆదేశించారు. లేదంటే శాఖాపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. చెరువులో పూర్తిస్థాయిలో నీటిమట్టం ఉన్నప్పుడు మాత్రమే అవసరం మేరకు అనుమతులు తీసుకొని నీటిని వాడుకునేందుకు అనుమతులు మాత్రమే ఉన్నాయన్నారు. అంతకుముందు గ్రామానికి చెందిన మత్స్యకారులు మాట్లాడుతూ.. మండుతున్న ఎండలతో చెరువులో నీటి నిల్వ రోజురోజుకు తగ్గిపోతున్నాయని, ఇప్పుడు మోటార్ల ద్వారా నీటిని తోడేస్తే నీటిమట్టం తగ్గిపోయి చెరువు ఎండిపోయే పరిస్థితి ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో చేప పిల్లలు చనిపోయి తాము ఆర్థికంగా దెబ్బ తినే పరిస్థితి వస్తుందని, మోటార్లను వెంటనే తొలగించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment