విద్యుత్‌శాఖకు రూ. 65 లక్షల నష్టం
● విరిగిన 150 కరెంట్ స్తంభాలు ● 14 సబ్‌స్టేషన్లలో తలెత్తిన సమస్యలు ● పలు గ్రామాలకు నిలిచిన విద్యుత్ ● మరమ్మతులు చేస్తున్న ట్రాన్స్‌కో సిబ్బంది
ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన అకాలవర్షం జిల్లాలో అపారనష్టాన్ని మిగిల్చింది. కరెంట్ స్తంభాలు విరిగిపడగా.. ట్రాన్స్‌ఫార్మర్లు దెబ్బతిన్నాయి. 14 సబ్‌స్టేషన్లలో సాంకేతిక సమస్యలు తలెత్తాయి. అనేక గ్రామాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోయి అంధకారం నెలకొంది. మొత్తంగా శుక్రవారం సాయంత్రం కురిసిన వర్షంతో జిల్లాలో విద్యుత్ శాఖకు రూ. 65 లక్షల మేర నష్టం వాటిల్లింది.
– మెదక్‌జోన్
జిల్లాలోని పలు మండలాల పరిధిలో శుక్రవారం సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు గాలి, వాన బీభత్సం సృష్టించింది. మెదక్, చిన్నశంకరంపేట, కొల్చారం, పాపన్నపేట మండలాల్లో ఈదురుగాలులకు 150కి పైగా విద్యుత్ స్తంభాలు విరిగిపోయాయి. 200 వరకు డీపీఆర్‌లు పగిలిపోయాయి. గద్దెలపై నుంచి ట్రాన్స్‌ఫార్మర్లు కింద పడిపోయాయి. అనేక గ్రామాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోగా.. రాత్రి పల్లెలు అంధకారంలో ఉన్నాయి. వందలాది చెట్లు నేలకొరగగా.. ఇళ్లపై రేకులు, పూరి గుడిసెలు ఎగిరిపోయాయి. కేవలం ట్రాన్స్‌కో శాఖకు ఏకంగా రూ. 65 లక్షల నష్టం వాటిల్లినట్లు ఆ శాఖ అధికారులు ప్రాథమిక అంచనా వేశారు. ఇది మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
సత్వర విద్యుత్ సేవలు
పాపన్నపేట(మెదక్): గాలి, వాన బీభత్సంతో ఏర్పడిన విద్యుత్ అంతరాయాన్ని సకాలంలో పునరుద్ధరించామని జిల్లా చీఫ్ ఇంజనీర్ బాలస్వామి తెలిపారు. శనివారం మండలంలో ఆయన పర్యటించి మరమ్మతు చర్యలను పర్యవేక్షించారు. మండలంలో 35 విద్యుత్ స్తంభాలు విరిగిపడగా, అందులో 20 నూతన స్తంభాలు ఏర్పాటుచేసి విద్యుత్ సేవలు పునరుద్ధరించామని తెలిపారు. దాదాపు మండలంలోని అన్ని గ్రామాలకు విద్యుత్ సేవలు అందిస్తున్నట్లు చెప్పారు. ఎస్‌ఈ శంకర్, డీఈ చాంద్‌భాషా, ఏడీఈ శ్రీనివాస్, ఏఈ నర్సింలు ఉన్నారు.
కొత్త స్తంభం ఏర్పాటు చేస్తున్న సిబ్బంది
131 ఎకరాల్లో దెబ్బతిన్న పంటలు
జిల్లావ్యాప్తంగా 131 ఎకరాల్లో వివిధ రకాల పంటలు దెబ్బతిన్నాయి. అందులో అత్యధికంగా జొన్న పంట 78 ఎకరాల్లో దెబ్బతింది. పెద్దశంకరంపేట, రేగోడ్ మండలాల్లో వడగండ్ల వాన కురవటంతో ఎక్కువగా నష్టం వాటిల్లినట్లు సంబంధిత అధికారులు చెబుతున్నారు. అలాగే 28 ఎకరాల్లో మామిడి తోటలు, 18 ఎకరాల్లో మొక్కజొన్న, 7 ఎకరాల్లో వరి పంట చొప్పున మొత్తం 131 ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. కాగా ప్రాథమిక పంటనష్టం అంచనా వేసిన అధికారులు రైతులకు పరిహారం ఇస్తారా..? లేదా అనేది తెలియాల్సి ఉంది.
మరమ్మతులు చేస్తున్నాం
ఈదురుగాలులకు విరిగిన విద్యుత్ స్తంభాలను తొలగించి నూతన స్తంభాలను ఏర్పాటుచేస్తున్నాం. అలాగే విరిగిపోయిన డీటీఆర్‌లు తొలగించి కొత్తవాటిని అమర్చుతున్నాం. సబ్‌స్టేషన్‌లలో తలెత్తిన సాంకేతిక సమస్యలను సరిచేస్తూ అన్ని గ్రామాలకు విద్యుత్ సరఫరాను పునరుద్ధరిస్తున్నాం.
– శంకర్, ట్రాన్స్‌కో ఎస్‌ఈ మెదక్
నష్టం మిగిల్చిన వర్షం