
అనుమతి లేకుండానే నిర్మాణాలు
మంజీరా నది ఒడ్డు నుంచి ఇరువైపులా 100 మీటర్ల మేర బఫర్‌జోన్‌లో పరిధిలోకి వస్తుంది. ఇందులో ఎలాంటి నిర్మాణాలు చేపట్టవద్దు. అవసరమైన నిర్మాణం చేయాలనుకుంటే, ఇరిగేషన్ శాఖ నుంచి నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ తీసుకోవాలి. అలాగే బఫర్ జోన్‌లో ఉన్న భూములను రెవెన్యూ అధికారులు నాలాగా మార్చొద్దు. వ్యవసాయ భూములను గుంటల్లో రిజిస్ట్రేషన్ చేయొద్దు. కానీ కాసులకు కక్కుర్తి పడిన రెవెన్యూ అధికారులు ఆ పనీ చేశారు. డీటీసీపీ లే అవుట్లు లేకుండానే ఎకరాల కొద్ది భూమిని ప్లాట్లుగా మార్చారు. పంచాయతీ కార్యదర్శులు సైతం అక్రమ నిర్మాణాలకు దర్జాగా అనుమతులిచ్చారు. గతంలో నాగ్సాన్‌పల్లి కార్యదర్శిగా ఉన్న నవీన్, ప్రస్తుతం విధులు నిర్వర్తిస్తున్న దుర్గాభవాని సుమారు 8 అక్రమ నిర్మాణాలకు అనుమతులిచ్చినట్లు తెలిసింది. ఇందులో వ్యాపార, వాణిజ్య కేంద్రాలు ఉన్నాయి. లాడ్జీలు నిర్మించారు. రాళ్ల భూములను చదును చేసే క్రమంలో భారీ బండరాళ్లను నిషేధిత డిటోనేటర్లతో పేల్చారు. పగిలిన రాళ్లను మంజీరా నదిలో వేస్తున్నారు. దీంతో మంజీరా పరివాహ ప్రదేశం తగ్గి వరదలు వచ్చినప్పుడు, దిగువన ఉన్న ఆలయం, పక్కన ఉన్న నిర్మాణాలు దెబ్బతినే ప్రమాదం ఉంది. అక్రమ భవనాలకు రోడ్లు, డ్రైనేజ్ వ్యవస్థ లేకపోవడంతో మురికి నీరు మంజీరా నదిలో కలుస్తుంది. అదే నీటిలో భక్తులు పుణ్యస్నానాలు చేస్తున్నారు. చిత్రమేమిటంటే నది ఒడ్డున దేవాదాయ శాఖ నిర్మించిన షాపింగ్ కాంప్లెక్స్‌లకు సైతం ఎన్‌ఓసీ తీసుకోలేదని సంబంధిత అధికారి తెలిపారు. సర్వే నంబర్ 1 నుంచి 8లో సైతం అక్రమ నిర్మాణాలు ఉన్నాయి. అయితే ఈ విషయమై కొల్చారం మండల అధికారులు విచారణ జరపాలనే డిమాండ్ ఉంది. ఇదే విషయమై నాగ్సాన్‌పల్లి పంచాయతీ కార్యదర్శి దుర్గాభవానిని వివరణ కోరగా.. నేను ఒక నిర్మాణానికి ఎన్‌ఓసీ లేకుండా అనుమతి ఇచ్చాను. అంతకుముందు పనిచేసిన నవీన్ ఇతర నిర్మాణాలకు అనుమతి ఇచ్చారని చెప్పారు.