
విద్యార్థులు ఉన్నతస్థాయిలో స్థిరపడాలి
డీబీసీడబ్ల్యూఓ జగదీష్
కౌడిపల్లి(నర్సాపూర్): హాస్టల్ విద్యార్థులు శ్రద్ధగా చదివి జీవితంలో ఉన్నతస్థాయిలో స్థిరపడాలని జిల్లా బీసీ సంక్షేమశాఖ అధికారి జగదీష్ అన్నారు. సోమవారం రాత్రి మండల కేంద్రంలోని బీసీ హాస్టల్‌లో వసతిగృహ సంక్షేమాధికారి ప్రణయ్‌కుమార్ అధ్యక్షతన జరిగిన వార్షికోత్సవానికి ముఖ్య అతిధిగా హాజరై మాట్లాడారు. విద్యార్థులు అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. హాస్టల్‌లో అన్నిరకాల సదుపాయాలు కల్పిస్తుందని, సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. పదో తరగతి పూర్తిచేసిన విద్యార్థులు ఇంటర్‌తో పాటు పైచదువులు బాగా చదివి తల్లిదండ్రులు, హాస్టల్‌కు మంచిపేరు తేవాలన్నారు. అనంతరం టీఎన్‌జీఓ జిల్లా ప్రధాన కార్యదర్శి రాజ్‌కుమార్ మాట్లాడుతూ.. ప్రభుత్వ హాస్టల్‌లో మెరుగైన సదుపాయలు ఉన్నాయన్నారు. కార్పొరేట్ స్థాయిలో వార్షికోత్సవాన్ని నిర్వహించడం అభినందనీయమని అన్నారు. కార్యక్రమంలో హెచ్‌డబ్ల్యూఓల సంఘం జిల్లా అధ్యక్షుడు శేషాచారి, ఎస్టీ ఆశ్రమ పాఠశాల ప్రిన్సిపాల్ జయరాజ్, జిల్లాలోని వివిధ హాస్టల్‌ల హెచ్‌డబ్ల్యూఓలు శేఖర్, మహేందర్, నవీన్, స్వామి, ఉన్నత పాఠశాల ఎస్‌ఎంసీ మాజీ చైర్మన్ జగన్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.