
నాణ్యమైన బియ్యం పంపిణీ చేయాలి
నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతారెడ్డి
నర్సాపూర్: సన్న బియ్యం పంపిణీని తాము స్వాగతిస్తున్నామని, అయితే నాణ్యమైన బియ్యం అందజేయాలని ఎమ్మెల్యే సునీతారెడ్డి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. బుధవారం ఆమె విలేకరులతో మాట్లాడుతూ.. పలు రేషన్ దుకాణాల ద్వారా పేదలకు అందజేస్తున్న సన్న బియ్యంలో 30 నుంచి 40 శాతం వరకు నూకలు వస్తున్నాయని తెలిపారు. మరికొన్ని దుకాణాల్లో సన్నబియ్యంలో దొడ్డు రకం బియ్యం కలిసి ఉంటున్నాయని వాపోయారు. నాణ్యమైన సన్న రకం బియ్యమే అందరికీ అందేలా చూడాలని డిమాండ్ చేశారు. అర్హులందరికీ కొత్త రేషన్‌కార్డులు ఇచ్చి వారికి సైతం సన్న బియ్యం అందించాలన్నారు. ఇందిరమ్మ లబ్ధిదారుల సంఖ్యను కుదించవద్దని కోరారు. కాంగ్రెస్ నాయకులు ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘించి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని మండిపడ్డారు. రేషన్ దుకాణాలను కాంగ్రెస్ కార్యాలయాలుగా మారుస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ నాయకుల ఫొటోలతో కూడిన ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడాన్ని ఖండిస్తున్నట్లు చెప్పారు. ఆమె వెంట బీఆర్‌ఎస్ నాయకులు అశోక్‌గౌడ్, భిక్షపతి, ప్రసాద్, ఆంజనేయులుగౌడ్, సద్దాం తదితరులు ఉన్నారు.