
పేటకు పూర్వ వైభవం తెస్తా
రామాయంపేట(మెదక్): అన్నిరంగాల్లో వెనుకబడిన రామాయంపేట పునర్విభజనలో మళ్లీ నియోజకవర్గ కేంద్రం అయ్యే అవకాశం ఉందని మెదక్ ఎంపీ రఘునందన్‌రావు అన్నారు. జాతీయ రహదారి (765 డీజీ) నిర్మాణంలో భాగంగా పేట వద్ద బైపాస్ రోడ్డు నిర్మాణం విషయమై భూములు కోల్పోతున్న రైతులు, వ్యాపారులతో శనివారం సమావేశం నిర్వహించారు. బైపాస్ రోడ్డు నిర్మాణం వద్దని, పాత రహదారి గుండానే జాతీయ రహదారి నిర్మించాలని భూ నిర్వాసితులు ఎంపీకి మొరపెట్టుకున్నారు. ఇప్పటికే రామాయంపేటకు అన్ని రంగాల్లో తీరని అన్యాయం జరిగిందని.. బైపాస్ రోడ్డు పూర్తయితే పరిస్థితి మరీ అధ్వానంగా మారుతుందని వాపోయారు. అనంతరం ఎంపీ మాట్లాడుతూ.. బైపాస్ రోడ్డు నిర్మాణానికి గెజిట్ విడుదలైనందున ఆ భూములు ప్రభుత్వ పరం అయ్యాయని చెప్పారు. పట్టణ అభివృద్ధికి తనవంతుగా సహకారం అందజేస్తానని హామీ ఇచ్చారు. భూములు కోల్పోతున్న బాధితులతో వచ్చే నెలలో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో సమావేశం ఏర్పాటు చేయిస్తానని అన్నారు. బైపాస్ రోడ్డు నిర్మాణానికి గాను ఎంజాయిమెంట్ సర్వేను అడ్డుకోవద్దని సూచించగా, బాధితులు అంగీకరించలేదు. సమావేశంలో అదనపు కలెక్టర్ నగేశ్, మెదక్ ఆర్డీఓ రమాదేవి, తహసీల్దార్ రజనికుమారి, డీఈ అన్నయ్య, ఇతర అధికారులు పాల్గొన్నారు.
బైపాస్ రోడ్డు నిర్మాణానికి
సహకరించండి
మెదక్ ఎంపీ రఘునందన్‌రావు