
ఎంత పని చేశావమ్మా..
తూప్రాన్: కన్న పిల్లలను కంటికి రెప్పలా కాపాడాల్సిన కన్న తల్లే వారిని కడతేర్చింది. చుట్టుముట్టిన ఆర్థిక పరిస్థితులతో జీవితం భారమై వారిని వాగులోకి తోసి అంతమొందించింది. అనంతరం తాను కూడా ఆత్మహత్యకు యత్నించింది. అయితే.. తృటిలో ప్రాణాలతో బయటపడింది. ఈ హృదయ విదారకరమైన సంఘటన తూప్రాన్‌లో సోమవారం జరిగింది. ఎస్‌ఐ శివానందం, గ్రామస్తుల కథనం ప్రకారం.. మాసాయిపేటకు చెందిన వడ్డేపల్లి స్వామి– మమత దంపతులకు ఇద్దరు కుమార్తెలు. మద్యానికి బానిసైన స్వామి నాలుగేళ్ల క్రితం అనారోగ్యంతో మృతి చెందాడు. కుటుంబ పెద్ద లేకపోవడంతో కుటుంబం గడవడం కష్టతరంగా మారింది. ఇద్దరు చిన్నారులతో కూలి పనులకు వెళ్ల లేక పస్తులుండాల్సిన పరిస్థితి దాపురించింది. చిన్న తనంలోనే మమత తల్లిదండ్రులను కోల్పోవడంతో చిన్నమ్మ పెద్ద చేసి పెళ్లి చేసింది. ఈక్రమంలో భర్త చనిపోవడంతో కుటుంబం రోడ్డున పడింది. దీంతో శివ్వంపేట మండలం దంతాన్‌పల్లిలో ఉండే చిన్నమ్మ మైసమ్మ వద్దకు ఇద్దరు చిన్నారులతో కలిసి చేరింది. కూలికి వెళ్లి వచ్చిన డబ్బులతో తన ఇద్దరు పిల్లలను పోషించుకుంటుంది. పెద్ద కూతురు పూజిత (7) గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో ఒకటో తరగతి చదువుతుండగా, రెండో కూతురు తేజస్విని (5) అంగన్‌వాడీ స్కూల్‌లో చదువుకుంటుంది.
దశదినకర్మకు వెళ్తున్నానని..
దుబ్బాక మండలం వడ్డెపల్లిలో బంధువుల ఇంట్లో దశదిన కర్మకు వెళ్తున్నానని చిన్నమ్మకు చెప్పిన మమత.. ఇద్దరు కూతుర్లతో కలిసి ఇంటి నుంచి ఉదయం 8.30 గంటలకు బయలు దేరింది. నాగులపల్లి సమీపంలోని రైలు పట్టాలపై కూర్చొని తన బిడ్డలతో ‘నాన్న వద్దకు వెళుదాం’అని చెప్పింది. అనంతరం దంతాన్‌పల్లిలోని తన ఇంటి పక్కన ఉన్న కుటుంబ సభ్యులతో ఫోన్‌లో పిల్లలతో మాట్లాడించింది. ‘మా అమ్మ మమ్ముల్ని.. మా నాన్న వద్దకు తీసుకెళుతానంటుంది, మేము అక్కడికే వెళ్తున్నాం’ఆ చిన్నారులు ఫోన్‌లో మాట్లాడారు. అనుమానం వచ్చిన పక్కింటి వారు రైలు పట్టాల వద్ద వెతికినా ఎలాంటి ఆచూకీ లభించలేదు. ఫోన్ పని చేయలేదు. గంట అనంతరం హల్దీవాగులో ఇద్దరు చిన్నారులతో కలిసి దూకింది. మమత ప్రాణాపాయ స్థితి నుంచి బయటపడగా.. పిల్లలు మృత్యువాతపడ్డారు. గజ ఈతగాళ్ల సహాయంతో వాగు నుంచి ఇద్దరు చిన్నారుల మృతదేహాలపై బయటకు తీశారు. పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించా రు. కుటుంబ సభ్యులు, గ్రామస్తులు సంఘటన స్థలా నికి చేరుకొని బో రున విలపించారు. పోలీసులు తల్లి మమతను అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
ఆర్థిక ఇబ్బందులతో
కన్న పిల్లలను కడతేర్చిన తల్లి
ఆపై తాను వాగులోకి దూకి
ఆత్మహత్యాయత్నం
తృటిలో ప్రాణాపాయం నుంచి
బయటకు..