
ప్రజావాణి అర్జీలు త్వరగా పరిష్కరించాలి
మెదక్ కలెక్టరేట్: ప్రజావాణిలో వచ్చే ఫిర్యాదులకు మొదటి ప్రాధాన్యం ఇస్తూ త్వరితగతిన పరిష్కరించాలని అదనపు కలెక్టర్ నగేష్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో జరిగిన ప్రజావాణికి డీఆర్‌ఓ భుజంగరావు, డీఆర్డీఓ పీడీ శ్రీనివాసరావు, జెడ్పీ సీఈఓ ఎల్లయ్యతో కలిసి ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. ఈసందర్భంగా జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజలు తమ తమ సమస్యలపై 61 వినతులు అందజేశారు.
భూ భారతితో
సమస్యలు పరిష్కారం
పెద్దశంకరంపేట(మెదక్): భూభారతి చట్టంతో రైతుల సమస్యలు దూరం కానున్నాయని నారాయణఖేడ్ ఎమ్మెల్యే సంజీవరెడ్డి అన్నారు. సోమవారం పెద్దశంకరంపేట తహసీల్దార్ కార్యాలయంలో భూ సమస్యలపై అధికారులతో చర్చించారు. మంగళవారం రైతువేదికలో నిర్వహించే అవగాహన సదస్సుకు సంబంధించి పలు సూచనలు చేశారు. అయా గ్రామాల రైతుల సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకొని రావాలని, రైతులు ఎక్కువగా హాజరయ్యేలా చూడాలని ఆదేశించారు. కార్యక్రమంలో ఇన్‌చార్జి తహసీల్దార్ శ్రీనివాస్, ఎంపీడీఓ విఠల్‌రెడ్డి, కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు మధు, నాయకులు సురేందర్‌రెడ్డి, గంగారెడ్డి, కుంట్ల రాములు, రాజన్‌గౌడ్, గోవింద్‌రావు, తదితరులు పాల్గొన్నారు.
‘బైపాస్’ వద్దే వద్దు
రామాయంపేట(మెదక్): మెదక్– ఎల్కతుర్తి (765 డీజీ) జాతీయ నిర్మాణంలో భాగంగా రామాయంపేట వద్ద బైపాస్ రోడ్డు నిర్మించవద్దని భూ నిర్వాసితులు సోమవారం సర్వే పనులను అడ్డుకోవడానికి యత్నించారు. పనులు ఆపి వేయకపోతే ఆత్మహత్య చేసుకుంటామని హెచ్చరించారు. సీఐ వెంకట్‌రాజాగౌడ్, ఎస్‌ఐ బాల్‌రాజ్ వారిని సముదాయించారు. పనులు అడ్డుకుంటే కేసులు నమోదవుతాయని హెచ్చరించారు. ఎట్టి పరిస్థితుల్లో పనులు కొనసాగుతాయని, నష్టపరిహారం పెంపు, ఇతర సమస్యలుంటే పై అధికారులను సంప్రదించాలని ఆర్డీఓ రమాదేవి సూచించారు. ఇదిలా ఉండగా ఈ గొడవల మధ్య సర్వే కొనసాగింది. బైపాస్ రోడ్డు నిర్మాణంతో కుటుంబాలు రోడ్డున పడుతున్నాయని, తమను ఆదుకోవాలని బాధితులు విజ్ఞప్తి చేశారు.
వెంట వెంటనే
ధాన్యం తరలింపు
చిన్నశంకరంపేట(మెదక్)/హవేళిఘణాపూర్: కొనుగోలు కేంద్రాల్లో కాంటా చేసిన ధాన్యం వెంట వెంటనే రైస్ మిల్లులకు తరలించేందుకు చర్యలు చేపట్టినట్లు అదనపు కలెక్టర్ నగేష్ తెలిపారు. సోమవారం మండలంలోని ధరిపల్లి ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆకస్మిక తనిఖీ చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంటా చేసిన ధాన్యం వెంటనే తరలించాలని సూచించారు. రైస్‌మిల్లు సమస్యలు ఉన్న, లారీల కొరత ఉన్నా వెంటనే తహసీల్దార్ దృష్టికి తీసుకెళ్లాలని ఆదేశించారు. అలాగే హవేళిఘణాపూర్ మండల పరిధిలోని కూచన్‌పల్లి, గాజిరెడ్డిపల్లి, బూర్గుపల్లి కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. లారీల కొరత లేకుండా చూడాలన్నారు.
బాల్య వివాహాలపై
అవగాహన అవసరం
మెదక్ మున్సిపాలిటీ: బాల్య వివాహాలపై తప్పనిసరిగా అవగాహన కలిగి ఉండాలని మెదక్ సీనియర్ సివిల్ జడ్జి రామశర్మ అన్నారు. సోమవారం పట్టణంలోని అవుసులపల్లిలో పోక్సో చట్టం.. బాల్య వివాహాలపై న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు.

ప్రజావాణి అర్జీలు త్వరగా పరిష్కరించాలి

ప్రజావాణి అర్జీలు త్వరగా పరిష్కరించాలి