
సోలార్ ప్లాంట్ల ఏర్పాటుపై అనాసక్తి
● ముందుకు రాని రైతులు
● ఉమ్మడి మెదక్ జిల్లాలో 363 మంది దరఖాస్తు
● ఇప్పటి వరకు ఈఎండీ చెల్లించింది 94 మందే
● సబ్సిడీ అందించాలంటున్న అన్నదాతలు
● ‘పీఎం కుసుమ్’లో 0.5 నుంచి 2 మెగావాట్ల ప్లాంట్ల ఏర్పాటుకు అవకాశం
జిల్లా పేరు దరఖాస్తులు ఈఎండీ
చెల్లించిన వారు
సిద్దిపేట 179 37
మెదక్ 74 24
సంగారెడ్డి 110 33
దరఖాస్తు చేసిన రైతు భూమిని
పరిశీలిస్తున్న రెడ్కో అధికారులు
‘సౌర’ పంటకు రైతులు వెనుకడుగు వేస్తున్నారు. పీఎం– కుసుమ్ పథకం కింద పంట పొలాల్లో సోలార్ ప్లాంట్ల ఏర్పాటుకు కేంద్రం అనుమతి ఇచ్చింది. ఇంధన వనరుల అభివృద్ధి సంస్థ (టీజీ రెడ్కో) ఆధ్వర్యంలో దరఖాస్తులను గత ఫిబ్రవరి 28వ తేదీ వరకు స్వీకరించారు. రైతు కనీసం 0.5 నుంచి 2 మెగావాట్ల ప్లాంటు ఏర్పాటు చేసుకునే అవకాశం కల్పించింది. దీంతో ఉత్సాహంగా దరఖాస్తు చేసుకున్న రైతులు ప్లాంట్ ఏర్పాటుకు ముందుకు రాకపోవడం గమనార్హం.
సాక్షి, సిద్దిపేట: సాగు, బీడు భూముల్లో సోలార్ ప్లాంట్ల ఏర్పాటుతో రైతులు ఆదాయం పొందాలన్న ఉద్దేశ్యంతో కేంద్ర ప్రభుత్వం అవకాశం కల్పించింది. పీఎం – కుసుమ్‌లో భాగంగా ఉమ్మడి మెదక్ జిల్లాలో 430 విద్యుత్ సబ్ స్టేషన్ ప్రాంతాలను ఎంపిక చేశారు. వీటి పరిధిలో 363 మంది రైతులు దరఖాస్తు చేయగా అందులో ఈఎండీ (ఎర్నెస్ట్ మనీ డిపాజిట్)ను 94 మంది రైతులు మాత్రమే చెల్లించారు. ఈ ఈఎండీలు ఈ నెల 30వ తేదీతో గడువు ముగియనుంది.
మెగావాట్‌కు రూ.3 కోట్లు
ఒక్క మెగావాట్ విద్యుత్తు ఉత్పత్తి కోసం సోలార్ ప్లాంట్ ఏర్పాటు చేయాలంటే కనీసం రూ.3 కోట్ల వరకు ఖర్చు అవుతుందని అధికారులు అంచనా వేశారు. ఇందులో ఏదైన బ్యాంక్ రుణం పొందితే మెగావాట్‌కు 30శాతం లెక్కన రైతులు దాదాపు రూ.85లక్షల వరకు చెల్లించాల్సి ఉంటుంది. ఇది కాకుండా ప్లాంటు నుంచి విద్యుత్తు సబ్‌స్టేషన్ వరకు వేసే విద్యుత్తు లైన్ కోసం కిలో మీటరుకు రూ. 5లక్షలు ఖర్చు అవుతుంది. పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టాల్సి వస్తోందని ముందుకు రావడం లేదని దరఖాస్తు చేసిన రైతులు అంటున్నారు. కొంత ప్రభుత్వం నుంచి సబ్సిడీ అందజేయాలని రైతులు కోరుతున్నారు.
భూముల్లో కరెంట్ ఉత్పత్తి
ఉమ్మడి మెదక్ జిల్లాలో 33/11 కేవీ విద్యుత్ సబ్ స్టేషన్‌లకు ఐదు కిలోమీటర్ల పరిధిలో ఉన్న భూముల్లో 0.5 మెగావాట్ల నుంచి 2 మెగా వాట్ల సామర్థ్యం వరకు కేంద్రాలను ఏర్పాటు చేసుకోవచ్చు. తెలంగాణ విద్యుత్తు రెగ్యులేటరీ కమిషనర్ (టీజీఈఆర్సీ) ఒక్కో యూనిట్‌కు రూ.3.13లను నిర్ణయించిన టారిఫ్ ప్రకారం కొనుగోలు చేయనున్నారు. దీంతో రైతులకు ఆదాయం రానుంది. ఒక్క మెగావాట్ ప్లాంట్‌లో రోజుకు 4600 నుంచి 5వేల యూనిట్ల వరకు సౌరశక్తిని ఉత్పత్తి చేయవచ్చు. ఈలెక్కన యేడాదికి సుమారు రూ.60 లక్షల వరకు పొందవచ్చు.
జనవరి నుంచి విద్యుత్ ఉత్పత్తి
దరఖాస్తు చేసి ఈఎండీ చెల్లించిన వారిచే డిసెంబర్ వరకు సోలార్ ప్లాంట్ ఏర్పాటు చేసే విధంగా కృషి చేస్తాం. అలాగే ఈ ప్లాంట్ జనవరి నుంచి విద్యుత్ ఉత్పత్తి చేసే విధంగా ప్రణాళికలు రూపొందించాం. ఈ నెలాఖరు వరకు ఈఎండీ చెల్లించే గడువు ఉండటంతో మరి కొందరు చెల్లించే అవకాశం ఉంది. ప్రభుత్వం కల్పించిన అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోండి.
–రవీందర్ చౌహాన్, డీఎం, రెడ్కో

సోలార్ ప్లాంట్ల ఏర్పాటుపై అనాసక్తి