ఎక్కడున్నారో.. ఏమయ్యారో? | - | Sakshi
Sakshi News home page

ఎక్కడున్నారో.. ఏమయ్యారో?

Published Sat, Apr 26 2025 8:04 AM | Last Updated on Sat, Apr 26 2025 8:06 AM

ఆందోళన కలిగిస్తున్న అదృశ్యం కేసులు

మెదక్‌ మున్సిపాలిటీ: జిల్లాలో ఏటేటా అదృశ్యం కేసులు పెరుగుతున్నాయి. పోలీసులు వారిని గుర్తించేందుకు శ్రమిస్తున్నా ఫలితాలు మిశ్రమంగానే ఉంటున్నాయి. జిల్లావ్యాప్తంగా 2023 నుంచి ఇప్పటివరకు వివిధ కారణాలతో ఆయా పోలీస్‌స్టేషన్ల పరిధిలో 1,063 మిస్సింగ్‌ కేసులు నమోదయ్యాయి. అందులో కొందరు అప్పుల బాధ, మరికొందరు ప్రేమ పేరుతో, ఇంకొందరు వివాహేతర సంబంధాలు, కుటుంబ కలహాలు, మానసిక స్థితి సరిగా లేక ఇంట్లో నుంచి వెళ్లిపోయారు. పోలీసులు సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి కొందరి ఆచూకీ తెలుసుకొని కుటుంబ సభ్యులకు అప్పగించారు. అయితే మరికొందరి ఆచూకీ మాత్రం ఇప్పటికీ దొరకడం లేదు. అయితే వారు ఎక్కడున్నారో.. ఎలా ఉన్నారో.. తెలియక కుటుంబ సభ్యులు ఏళ్ల తరబడి ఆందోళన చెందుతున్నారు. పోలీసులు వారి వివరాలను తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాల్లోని పోలీసులకు అందజేసి ఆరా తీస్తున్నారు.

ప్రేమ వివాహాలు.. కుటుంబ కలహాలు

జిల్లాలో చాలా మంది యవతీ, యువకులు ప్రేమ వివాహాల కోసం ఇంటి నుంచి వెళ్తున్నారు. తెలిస్తే ప్రాణహాని ఉంటుందని, కుటుంబ సభ్యులు నిరాకరిస్తారని ఇంటి నుంచి పారిపోయి ఎక్కడో తలదాచుకొని జీవనం కొనసాగిస్తున్నారు. అందులో కొందరి అచూకీ తెలిసినా.. మరికొందరు ఎలాంటి సాంకేతిక పరిజ్ఞానానికి దొరకకపోవడంతో కష్టతరంగా మారుతోంది. అలాగే కుటుంబ కలహాలతోనూ పలువురు అదృశ్యమవుతున్నారు. నాలుగు గోడల మధ్య జరిగిన గొడవను పెద్దది చేసుకుంటున్నారు. చిన్న చిన్న మనస్పర్థలతో మనస్తాపానికి గురై ఇంటి నుంచి వెళ్లిపోతున్నారు.

జిల్లాలో 45 మంది ఆచూకీ లభించని వైనం

సాంకేతిక పరిజ్ఞానంతో జల్లెడ పడుతున్న పోలీసులు

మెదక్‌ పట్టణంలోని కోలిగడ్డ (గొల్లగడ్డ) వీధికి చెందిన 60 ఏళ్ల వృద్ధురాలు మ్యాకల లక్ష్మి గతేడాది నవంబర్‌ 2వ తేదీన అదృశ్యమైంది. కుటుంబ సభ్యులు చుట్టుపక్కల, తెలిసిన వారి వద్ద వెతికినా ఆచూకీ లభించలేదు. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాగా ఆమె జాడ ఇప్పటివరకు తెలియరాలేదు. కుటుంబీకులు ఆరు నెలలుగా కంటి మీది కునుకు లేకుండా గడుపుతున్నారు. బరువెక్కిన గుండెతో రోదిస్తున్నారు. ఎక్కడుందో.. ఎన్ని కష్టాలు పడుతుందోనని కన్నీటి పర్యంతమవుతున్నా రు. మా లక్ష్మిని వెతికి పెట్టండంటూ పోలీసులను వేడుకుంటున్నారు.

ప్రతి నెల సమీక్షిస్తాం

జిల్లాలో వివిధ కారణాలతో చాలా మంది ఇంటి నుంచి వెళ్లిపోతున్నారు. దీంతో ఆయా పోలీస్‌స్టేషన్లలో ఫిర్యాదులు అందుతున్నాయి. ప్రస్తుతం సాంకేతిక పరిజ్ఞానంతో పోలీస్‌శాఖ చాలా ఆచూకీ గుర్తించి వారి కుటుంబాలకు అప్పగించింది. కొంతమంది ఆచూకీ మాత్రం లభించడం లేదు. దర్పన్‌ యాప్‌లో మిస్సింగ్‌ అయిన వారి వివరాలు, గుర్తు తెలియని వ్యక్తులు మరణిస్తే వారి వివరాలు, ఫొటోలు నమోదు చేస్తున్నాం. ప్రతినెల మిస్సింగ్‌ కేసులపై సమీక్ష ఉంటుంది.

– ఉదయ్‌కుమార్‌రెడ్డి, ఎస్పీ

ఇటీవల నర్సాపూర్‌ మండలంలోని ఓ గ్రామానికి చెందిన యువతి పట్టణంలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బంధువును పరామర్శించడానికి తల్లితో కలిసి వెళ్లింది. తల్లి ఆస్పత్రిలో ఉండగా యువతి బయటకు వచ్చి కనపడకుండా పోయింది. తల్లి, బంధువులు చుట్టుపక్కల వెతికినా ఆచూకీ లభించలేదు. దీంతో చేసేది లేక పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఎక్కడున్నారో.. ఏమయ్యారో?1
1/3

ఎక్కడున్నారో.. ఏమయ్యారో?

ఎక్కడున్నారో.. ఏమయ్యారో?2
2/3

ఎక్కడున్నారో.. ఏమయ్యారో?

ఎక్కడున్నారో.. ఏమయ్యారో?3
3/3

ఎక్కడున్నారో.. ఏమయ్యారో?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement